వరల్డ్ ఛాంపియన్‌పై 3 ఏళ్ల బ్యాన్..

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి సంచలనం సృష్టించిన మెక్సికో స్టార్ ఆర్చర్ మరియానా బెర్నాల్ కు భారీ షాక్ తగిలింది. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ITA) ఆమెపై మూడేళ్ల నిషేధం విధించింది. 23 ఏళ్ల బెర్నాల్ సెప్టెంబర్ 2025లో నిర్వహించిన అవుట్-ఆఫ్-కాంపిటిషన్ డోపింగ్ పరీక్షలో నిషేధిత స్టెరాయిడ్ నాండ్రోలోన్ (Nandrolone)కు పాజిటివ్‌గా తేలింది. ఈ ఆరోపణలను ఆమె సవాలు చేయకపోవడంతో శిక్షను అంగీకరించినట్లు ఐటీఏ వెల్లడించింది.

ఒలింపిక్స్ ఆశలకు బ్రేక్…

ఈ నిషేధంతో ఆమెకు 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం కోల్పోయింది. అలాగే ఆమెకు లభించిన 2025 వరల్డ్ కప్ ఫైనల్స్ టైటిల్‌ను కూడా రద్దు చేశారు. సాధారణంగా ఇలాంటి డోపింగ్ ఉల్లంఘనకు నాలుగేళ్ల నిషేధం విధించాల్సి ఉండగా, ముందుగా తప్పును అంగీకరించినందుకు శిక్షను ఒక సంవత్సరం తగ్గించి మూడు సంవత్సరాలకు పరిమితం చేసినట్లు ITA పేర్కొంది.

టైటిల్ తర్వాతే డోపింగ్ బహిర్గతం

దక్షిణ కొరియాలోని గ్వాంగ్జూ ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో మెక్సికో జట్టుకు స్వర్ణం సాధించడంలో బెర్నాల్ కీలక పాత్ర పోషించింది. అమెరికాపై ఫైనల్‌లో విజయం సాధించిన కొద్ది వారాల్లోనే డోపింగ్ ఆరోపణలు వెలుగులోకి రావడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో నమూనా సేకరించిన తేదీ నుంచి ఆమె వ్యక్తిగత రికార్డులు, రిజ‌ల్ట్స్ రద్దు చేయనున్న‌ట్టు ITA తెలిపింది. అయితే ఆ వరల్డ్ ఛాంపియన్‌షిప్ జట్టు గోల్డ్ మాత్రం కొనసాగుతుందని వెల్లడించింది.