సమగ్ర భూ సర్వేకు రైతులు సహకరించాలి..

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

చెన్నూర్, ఆంధ్రప్రభ: సమగ్ర భూ సర్వే ద్వారా భూముల హద్దులు ఖచ్చితంగా నిర్ధారణ అవుతాయని, అధికారులు చేపట్టే సర్వేకు రైతులు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు.

శుక్రవారం చెన్నూర్ మండలం కిష్టంపేట రైతు వేదికలో నిర్వహించిన రైతుల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర భూ సర్వేతో రైతుల భూముల హద్దులు స్పష్టంగా నిర్ధారణ అవుతాయని తెలిపారు. తద్వారా భూ వివాదాల పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు.

రైతులు భూ సర్వేను సద్వినియోగం చేసుకుని తమ భూములకు సంబంధించిన పత్రాలను అధికారులకు చూపించి సహకరించాలని సూచించారు. ఈ సదస్సులో రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

కేజీబీవీని సందర్శించిన కలెక్టర్..

అనంతరం చెన్నూర్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. పాఠశాలలో నిర్మాణంలో ఉన్న ఆధునిక కిచెన్ షెడ్, పాఠశాల పరిసరాలను పరిశీలించారు.

కిచెన్ షెడ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు, కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యాబోధన, వసతులపై విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

విద్యార్థినుల హాజరు శాతం, మెనూ ప్రకారం అందుతున్న భోజనం గురించి ఆరా తీశారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.