మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన బీఆర్ఎస్ నాయకులు..

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు తమపై నమోదైన అక్రమ కేసులకు సంబంధించి తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదుల ద్వారా వకాలత్ దాఖలు చేశారు.

బీఆర్ఎస్ నాయకులు కాంతాల కేశవరెడ్డి, ఎండీ జాకీర్ అలీ, నేరెళ్ల కమలాకర్, వంచ సాంబశివరెడ్డి, ఆవుల శ్రీనివాస్, కూస కుమారస్వామి, కాంతాల రవీందర్‌రెడ్డి, రేవూరి సుధాకర్‌రెడ్డి, వేల్పుల గణేష్, కిషోర్‌లపై కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిబ్రవరి 2024లో ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసుకు సంబంధించి తొలుత జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ), ఢిల్లీలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆ కేసును తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం బాధితుల వాంగ్మూలాలను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ అధికారులు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధితుల తరఫున బీఆర్ఎస్ రాష్ట్ర లీగల్ సెల్ న్యాయవాదులు లలితారెడ్డి, వేణుగోపాల్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా లీగల్ సెల్ న్యాయవాదులు గుర్రాల వినోద్ కుమార్, శ్రీరాం కిరణ్ కుమార్, వేణు పటేల్, పుల్ల ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు.