గ్రామసభ తీర్మానాలు అమలు చేయాలి..

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుర్రెవుల గ్రామంలో గ్రామసభలో ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదించిన పలు తీర్మానాలు అమలుకు నోచుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై పలుమార్లు తీర్మానాలు చేసినప్పటికీ, వాటిని అమలు చేయడంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగునీరు రోడ్లపైనే నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోందని తెలిపారు. తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, పూడికతో నిండిపోయిన బోరుబావుల కారణంగా నీటి సరఫరా కూడా సక్రమంగా జరగడం లేదని వాపోయారు.

మరోవైపు గ్రామంలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రరూపం దాల్చాయని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ సమస్యలన్నింటినీ గ్రామసభలో ప్రస్తావించి తీర్మానాలు చేసినప్పటికీ, సర్పంచ్, ఉపసర్పంచ్ వాటి అమలుపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలోని సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. గ్రామసభ తీర్మానాలను వెంటనే అమలు చేసి గుర్రెవుల గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం, సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.