నకిలీ రసీదులతో రూ.70 లక్షల మోసం..
- స్కానింగ్ సెంటర్ ఉద్యోగి అరెస్ట్
నిజామాబాద్ క్రైమ్, ఆంధ్రప్రభ: నగరంలోని ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌లో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులు నకిలీ నగదు రసీదులు తయారు చేసి సంస్థ యాజమాన్యాన్ని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంస్థ యజమాని ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం, 2009 నుంచి సేవలు అందిస్తున్న ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేసిన గుండారం సత్యనారాయణ, ఉద్యోగి టి. మీనా కలిసి పథకం ప్రకారం సంస్థను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఫిర్యాదు ప్రకారం, రోగులకు ఇచ్చే అసలు నగదు రసీదుల్లో కార్బన్ పేపర్ తొలగించి, అదే బిల్లు నంబర్‌తో పరీక్షల వివరాలు, చెల్లించిన మొత్తాన్ని తక్కువగా చూపిస్తూ నకిలీ రసీదులు రూపొందించినట్లు పోలీసులు తెలిపారు. రోగులకు అసలు మొత్తంతో కూడిన రసీదు ఇచ్చిన అనంతరం కార్యాలయ రికార్డుల్లో మాత్రం పరీక్షల వివరాలు, ఫీజులను మార్చి నమోదు చేసి రోజువారీ నగదును దుర్వినియోగం చేసినట్లు గుర్తించినట్లు వెల్లడించారు.
ఈ అక్రమాలు సుమారు ఆరు సంవత్సరాలుగా కొనసాగాయని, దీంతో సంస్థకు రూ.70 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. అక్రమాల విషయం బయటకు రాకుండా ఇతర ఉద్యోగులను బెదిరించడం, కొన్ని ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించినట్లు కూడా ఫిర్యాదులో ఉందన్నారు. 2025 జనవరి నుంచి జూలై వరకు ఉన్న నగదు రసీదుల ప్రతులను బాధితుడు పోలీసులకు అందజేసినట్లు పేర్కొన్నారు.
దర్యాప్తులో అక్రమంగా సొమ్ము కూడబెట్టి గుండారం సత్యనారాయణ తన భార్య పేరిట భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలు, నగదు రసీదులు, సంబంధిత రికార్డులు, ఇతర ఆధారాలను పరిశీలించి గుండారం సత్యనారాయణ, టి. మీనా, సత్యనారాయణ భార్యపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి వెల్లడించారు.
శుక్రవారం మాణిక్‌బండార్ గ్రామంలో గుండారం సత్యనారాయణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.
