జూపల్లి వ్యాఖ్యలు వాస్తవమే.. ఆధారాలతో నిరూపిస్తాం
- నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి
- శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ డాక్టర్ రాజేష్ రెడ్డి
నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యమని, వాటిని ఆధారాలతో నిరూపించేందుకు తాము ఎప్పుడైనా సిద్ధమని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కుచుకుళ్ల రాజేష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని, వాటిని ఆధారాలతో నిరూపిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ నిరూపించలేకపోతే మంత్రి రాజీనామా చేస్తారన్న సవాల్‌ను గుర్తు చేస్తూ, అదే విధంగా నిరూపిస్తే కేటీఆర్, హరీశ్‌రావు రాజీనామా చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. బీఆర్ఎస్ చేయలేని అనేక పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందని, ఆరు గ్యారంటీల్లో రెండింటిని మినహాయించి మిగిలిన హామీలన్నింటినీ అమలు చేశామని పేర్కొన్నారు. నిర్మాణాత్మక సూచనలు చేయాల్సింది పోయి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
బీజేపీపై కూడా మల్లు రవి విమర్శలు చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించకుండా బీజేపీ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. మంత్రి జూపల్లి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలోనే చెప్పిన వాస్తవాలేనన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరుకు జరిగిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. కృష్ణా జలాల దోపిడీ కేసీఆర్ హయాంలోనే ఎక్కువగా జరిగిందని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఒక్క ఎకరానికైనా నీరు అందించామని నిరూపిస్తే తాము రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై భారీగా ప్రజాధనం వృథా అయిందని ఆరోపించారు.
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కుచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. నార్లాపూర్ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికైనా నీరు అందించలేదని బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. మంత్రి జూపల్లి విసిరిన సవాల్‌ను కేటీఆర్, హరీశ్‌రావు స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తీగల సునంద, కాంగ్రెస్ నాయకులు బండ పర్వతాలు, యారా రమేష్, జక్కా రాజు, వంకేశ్వరం నిరంజన్, కొత్తపల్లి వినోద్ తదితరులు పాల్గొన్నారు.
