స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు న్యాయం చేయాలి..
- సీఐటీయూ డిమాండ్
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని,కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కృష్ణవేణి, ఐ.యన్.టి.యు.సి నాయుకులు సనపల.అన్నాజీరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద కేంద్ర కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వారు మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి .50 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్ ఎస్ఎంఎస్ దుర్ఘటనలో 10 మంది కార్మికులను కోల్పోవడం బాధాకరమని, ఇటువంటి దుర్ఘటన గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. ఇది ప్రమాదం కాదని ప్రభుత్వ వైఫల్యం అని అన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాల దుష్ఫలితం అని అన్నారు. నాశిరకం మెటీరియల్ వాడడం, భద్రతా ప్రమాణాలు అమలు చేయకపోవడం కారణం అన్నారు. న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. వి.ఆర్.ఎస్ పేరుతో నైపుణ్యం గల ఉద్యోగులను ఇంటికి సాగానంపారని, అనుభవం గల వేలాది మంది కాట్రాక్టు కార్మికులను అక్రమంగా ఉద్యోగాలు తొలగించారని, ఉన్న ఉద్యోగులపై పనిభారం పెంచారని అన్నారు.
బాధితులని పరామర్శించడానికి వచ్చిన మంత్రివర్యులు లోకేష్ కార్మికులకు పరిహారంపై అడిగినప్పుడు మీ ఇంట్లోవారు చనిపోయారా? అంటూ వ్యంగ్యంగా మాట్లాడ్డం, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ మీడియా ముందు విలేకరుల ప్రశ్నకు జరిగిన దుర్ఘటనపై నాకు అంత అవగాహన లేదంటూ మాట్లాడ్డం సరైనది కాదని అన్నారు. నాసిరకం మెటీరియల్ కొనుగోలుకు బాధ్యులు ఎవరు? శాశ్వత ఉద్యోగులను విఆర్ఎస్ ద్వారా పంపించి అనుభవమున్న కాంటాక్ట్ కార్మికులను వీధులు పాలు చేసింది చేయాలని ఆదేశించినది ఎవరు? ఇవన్నీ తేలాలంటే న్యాయ విచారణ జరపాలి. తక్షణమే న్యాయ విచారణకు ఆదేశించి కార్మికులకు భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటన జరగకుండా చూస్తారని యాజమాన్యం సరైన భరోసా కల్పించాలి. వెయ్యి కోట్లకుపైగా రామెటీరియల్ మరియు ఫెర్రో అల్లాయ్ లో జరుగుతున్న అవినీతిపై నిరంతరం స్టీల్ ప్లాంట్ యూనియన్లు హెచ్చరిస్తూనే ఉన్నాయి. సిబిఐకి సైతం ఫిర్యాదు చేశాయి.
అయినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా చేయని తప్పుకి పది ప్రాణాలు బలి అయ్యాయి. పరిహారం చెల్లింపును పరిహాసంగా మార్చేశారు. కనీసం అధికారికంగా సంతాపం కూడా ప్రకటించలేదు. ప్రధాన మంత్రి కంటితుడుపుగా రూ.2 లక్షలు ప్రకటించడం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం నుండి తగిన పరిహారం లేదు. కార్మికులకు వచ్చే కార్మికుల కష్టార్జితాన్ని ప్రభుత్వం ప్రకటించినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారు. కార్మికులపైన, కార్మిక సంఘాలపైన నిందలు మోపుతున్నారని అన్నారు. తక్షణమే విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని, భవిష్యత్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రులు హక్కు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కాకుండా ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయుకులు అల్లు.సత్యన్నారాయణ, మణికొండ.ఆదినారాయణమూర్తి, యన్.వి.రమణ, ఎం.గోవర్ధనరావు, మెడికల్ రిప్రజెంటివ్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డి.వాసుదేవరావు, వివిధ సంఘాలు నాయుకుల కొత్తకోట.అప్పారావు, ఎల్.రామప్పడు,మన్యం.రమణ పి.జగ్గారావు, పి.జనార్ధనరావు, కె.వి.ఎల్.ఎస్. ఈశ్వరి, టి.ముత్యాలరావు డి.కిరణ్ నవిర.రామకృష్ణ, శివ, రామ్మోహన్, ఎస్ మల్లేశ్వరరావు, ఎస్ లక్ష్మి, ఇ.పుణ్యవతి, ఎస్.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
