TG Eco Town | సిద్ధాపూర్‌లో భగ్గుమంటున్న ప్రజాగ్రహం
TG Eco Town | సిద్ధాపూర్‌లో భగ్గుమంటున్న ప్రజాగ్రహం
ప్రభుత్వ జీవోతో మరింత ఉద్రిక్తత
సిద్ధాపూర్‌లో 86 ఎకరాల్లో ఎకో-టౌన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. జీవో 641 విడుదల
కాలుష్యం, భూగర్భ జలాల కలుషితంపై గ్రామాల ఆందోళన..
నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్
జపాన్ భాగస్వామ్యంతో నెట్‌జీరో లక్ష్యాల ప్రాజెక్టు అంటున్న ప్రభుత్వం..
ఉద్యమానికి సిద్ధమవుతున్న స్థానికులు
TG Eco Town | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్‌లో ప్రతిపాదిత ఎకో-టౌన్ (ఆధునిక ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం) ఏర్పాటుపై వివాదం మరింత ముదురుతోంది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం 86 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అధికారికంగా జీవో నంబర్ 641 జారీ చేసి ముందడుగు వేయగా.. మరోవైపు సిద్ధాపూర్‌తో పాటు సుమారు 30 గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకో-టౌన్ పేరుతో హైదరాబాద్ నగర చెత్తను తమ ప్రాంతానికి తరలిస్తున్నారని ఆరోపిస్తున్న గ్రామస్థులు, ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని హెచ్చరిస్తున్నారు.
సిద్ధాపూర్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, రైతులు ఈ ప్రాజెక్టు వల్ల తీవ్ర కాలుష్యం, దుర్వాసన, భూగర్భ జలాల కలుషితం, ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు లేదా ఐటీ పార్కులు వస్తాయని ఆశించి భూములు ఇచ్చామని, ఇప్పుడు అదే ప్రాంతంలో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటు చేయడం ప్రజలను మోసం చేసినట్లేనని మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తామని, ఎకో-టౌన్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు.
ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఇప్పటికే స్థానికులు రోడ్డెక్కి నిరసనలు చేపట్టగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా గ్రామస్తులకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వ దృష్టికి వారి అభ్యంతరాలను తీసుకెళ్లారు. ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టు పర్యావరణహిత విధానాలతోనే అమలు అవుతుందని చెబుతోంది. గురువారం విడుదల చేసిన జీవో నంబర్ 641 ద్వారా కొత్తూరు మండలం సిద్ధాపూర్‌లోని 86 ఎకరాల ప్రభుత్వ భూమిని జీహెచ్‌ఎంసీకి ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు అధికారికంగా కేటాయించింది. హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ కేంద్రం నిర్వహించబడనుంది. ప్రస్తుతం మల్కాజిగిరి పరిధిలోని జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌పై ఉన్న భారం తగ్గించడమే కాకుండా, అక్కడి పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని కూడా తగ్గించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం, జపాన్‌లోని కిటాక్యూషూ నగరం మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సుమారు 150 ఎకరాల్లో ఎకో-టౌన్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో తొలి దశగా 86 ఎకరాల్లో ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. వృత్తాకార ఆర్థిక వ్యవస్థ (Circular Economy), నెట్ జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యాలతో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. టీజీఐఐసీకి చెందిన భూమిని జీహెచ్‌ఎంసీకి ఉచితంగా కేటాయించినట్లు జీవోలో పేర్కొన్నారు.
అయితే ప్రభుత్వ వాదనలు, స్థానికుల ఆందోళనలు ప్రస్తుతం పరస్పర విరుద్ధంగా మారాయి. ప్రభుత్వం దీనిని ఆధునిక వ్యర్థాల నిర్వహణ కేంద్రంగా అభివర్ణిస్తుండగా, స్థానికులు మాత్రం దీనిని డంపింగ్ యార్డుగానే భావిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాజెక్టు అమలుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
