సినిమా పెట్టుబడుల పేరుతో మోసం?

  • మాజీ ఐపీఎస్ ఏ.కే. ఖాన్ కుమారుడిపై కేసు

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : మాజీ ఐపీఎస్ అధికారి ఏ.కే. ఖాన్ కుమారుడు మొహ్సిన్ ఖాన్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సినీ నిర్మాత వెంకట అనీష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఫిర్యాదు ప్రకారం, ‘మహారాగ్ని’ సినిమా కోసం పెట్టుబడిదారులను పరిచయం చేస్తానని నమ్మించి మొహ్సిన్ ఖాన్, తబ్రేజ్ కలిసి రూ.50 లక్షలు తీసుకున్నట్లు బాధితుడు ఆరోపించాడు. ఇందులో మొహ్సిన్ ఖాన్‌కు రూ.25 లక్షలు, తబ్రేజ్‌కు రూ.25 లక్షలు చొప్పున మొత్తం మూడు విడతల్లో నగదు చెల్లించినట్లు తెలిపాడు.

అయితే డబ్బులు తీసుకున్నప్పటికీ పెట్టుబడిదారులను పరిచయం చేయకుండా తప్పించుకుంటున్నారని, డబ్బులు తిరిగి కోరగా కార్యాలయానికి పిలిపించి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. “డబ్బులు అడుగుతావా… ఏం చేస్తావో చూద్దాం” అంటూ మొహ్సిన్ ఖాన్ బెదిరించడంతో పాటు, బౌన్సర్లతో అడ్డగించి ఆయుధాలు చూపించి దాడి చేసినట్లు ఆరోపించారు.

అదే సమయంలో తబ్రేజ్ కూడా ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని బాధితుడు పోలీసులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశాడు.

బాధితుడి ఫిర్యాదు ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్లు 126(2), 115(2), 352, 351(2), 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసులో చేసిన ఆరోపణలపై మొహ్సిన్ ఖాన్ లేదా తబ్రేజ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన వెలువడలేదు.