హిందీ వినియోగాన్ని మరింత పెంచాలి

రైల్వే అధికారులకు డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా సూచన..
విజయరథ్ ఈ-మ్యాగజైన్ ఆవిష్కరణ

విజయవాడ, ఆంధ్రప్రభ : హిందీ భాషను మరింత వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిఆర్ఎం మోహిత్ సోనాకియా పేర్కొన్నారు. దక్షిణ కోస్ట్ రైల్వే విజయవాడ డివిజన్ అధికార భాష అమలు కమిటీ సమావేశం గురువారం డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ అధికార భాష త్రైమాసిక ఈ-మ్యాగజైన్ విజయరథ్ ను ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్‌ఎం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార భాష విధానాన్ని సమర్థంగా అమలు చేయడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని పేర్కొన్నారు.

రోజువారీ నోటింగ్, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల్లో హిందీ వినియోగాన్ని పెంచడంతో పాటు ప్రతి తనిఖీ నివేదికలో కనీసం ఒక అంశాన్ని హిందీలో చేర్చాలని అధికారులకు సూచించారు. అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) పి.ఇ. ఎడ్విన్ మాట్లాడుతూ, హిందీ నోటింగ్‌లో నిర్దేశించిన 35 శాతం లక్ష్యానికి బదులుగా విజయవాడ డివిజన్ 87.87 శాతం, హిందీలో వచ్చిన లేఖలకు హిందీలోనే సమాధానం ఇవ్వడంలో 60 శాతం లక్ష్యానికి బదులుగా 88 శాతం పురోగతి సాధించినట్లు తెలిపారు. సీనియర్ రాజ్‌భాషా అధికారి హేమంత్ వాడేకర్ గత త్రైమాసిక అధికార భాష అమలుపై సమీక్షను వివరించారు. ఉద్యోగులకు నిర్వహించిన హిందీ శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్ల వివరాలను వెల్లడిస్తూ, అధికారిక కార్యకలాపాల్లో హిందీ వినియోగాన్ని మరింత పెంచాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అదనపు డీఆర్‌ఎం (ఆపరేషన్స్) శ్రీనివాస్‌రావు కొండ, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏ.వి.ఎస్.కే. ప్రసాద్, శాఖాధిపతులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.