ఆర్టీఓ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం పెద్దపల్లి ఆర్టీఓ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి సేవల నిర్వహణ తీరును సమీక్షించారు.
ఆర్టీఓ కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, రోజువారీ స్లాట్లు మరియు ఇతర సేవల జారీ ప్రక్రియపై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా అన్ని సేవలను నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా అందించాలని సూచించారు. ప్రజలకు సేవలందించడంలో ఎలాంటి జాప్యం లేదా అక్రమాలకు తావు లేకుండా బాధ్యతగా పనిచేయాలని హెచ్చరించారు.
అనంతరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి ప్రతిరోజు జరుగుతున్న రిజిస్ట్రేషన్ల వివరాలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలు అధిక సమయం వేచి ఉండకుండా వారి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం సవరించిన మార్కెట్ విలువల ప్రకారం ప్రతి రిజిస్ట్రేషన్‌ను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో జిల్లా రవాణా అధికారి రంజిత్ రెడ్డి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, ఆర్టీఓ సిబ్బంది పాల్గొన్నారు.
