Tragic incident | తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్ ప్రాణం తీసింది..

Tragic incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ముంబైలో గురువారం కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అంధేరి–సాకినాకా, జోగేశ్వరి ప్రాంతాలను కుర్లా, ఘాట్‌కోపర్‌తో అనుసంధానించే ఖైరానీ రోడ్డుపై మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

సమాచారం ప్రకారం, ఘటన జరిగిన సమయంలో బాధితుడు మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలంలో అతని గొడుగు, చెప్పులు కనిపించడంతో వెంటనే ముంబై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు రెండు గంటల తర్వాత అతని మృతదేహాన్ని వెలికితీశారు.

అధికారుల వివరాల ప్రకారం, ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నిర్వహిస్తున్న మరమ్మతుల పనుల కారణంగా మ్యాన్‌హోల్ మూతను తెరిచి ఉంచినట్లు గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడీ, నిర్లక్ష్యానికి బాధ్యుడిగా భావిస్తూ సంబంధిత కాంట్రాక్టర్‌పై హత్య కేసు నమోదు చేయాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.