శ్ర‌మ జీవుల ఉపాధికి స‌రికొత్త భ‌రోసా..

వీబీ జీ రామ్ జీతో గ్రామీణ కుటుంబాల జీవ‌నోపాధికి భ‌ద్ర‌త‌
స‌మాజం, గ్రామం, శ్రామికుల‌కు ఎంతో ప్ర‌యోజ‌నం
మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి మ‌రో పెద్ద ముంద‌డుగు
100 రోజుల పని పరిమితిని 125 రోజులకు పెంపు
వేత‌నం రూ. 307 నుంచి రూ. 312కు పెంచుతూ ఆర్థిక చేయూత‌
జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, ఎమ్మెల్యే వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్‌

జి కొండూరు, ఆంధ్రప్రభ : స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ @ 2047 దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు స‌రికొత్త‌గా రూపుదిద్దుకుంటున్నాయ‌ని, ఇందులో భాగంగా అమ‌ల్లోకి వ‌చ్చిన వీబీ జీ రామ్ జీ (విక‌సిత్ భార‌త్ – గ్యారంటీ ఫ‌ర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిష‌న్ – గ్రామీణ్‌)తో శ్ర‌మ‌జీవుల ఉపాధికి స‌రికొత్త భ‌రోసా ల‌భిస్తుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, మైల‌వ‌రం శాస‌న‌స‌భ్యుడు వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్ అన్నారు. గురువారం జి.కొండూరు మండ‌లం, చెవుటూరులో జిల్లా నీటి యాజ‌మాన్య సంస్థ (డ్వామా) ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన వీబీ జీ రామ్ జీ ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్ పాల్గొన్నారు.

బండ్ల వాగు ఫీడ‌ర్ ఛాన‌ల్ అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించారు. ప‌నులు ప్రారంభించిన అనంత‌రం జి.కొండూరు క‌మ్యూనిటీ హాల్ వ‌ద్ద జ‌రిగిన కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ.. శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణప్ర‌సాద్ పాల్గొన్నారు. తిరుప‌తి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కావారిపల్లెలో కేంద్ర‌మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్న కార్య‌క్రమాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వీక్షించారు. కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ గ్రామీణ కుటుంబాల ఆర్థికాభివృద్ధి, జీవనోపాధి భద్రత, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వీబీ జీ రామ్ జీ ప‌థ‌కం దోహ‌దం చేస్తుంద‌న్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో అవసరాలను గుర్తించి, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ పథ‌కం ద్వారా ఉపాధి హామీ పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడంతో పాటు రోజువారీ వేతనాన్ని రూ.307 నుంచి రూ.312కు పెంచడం ద్వారా గ్రామీణ శ్రామిక కుటుంబాలకు అదనపు ఆర్థిక భరోసా క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు భూగ‌ర్భ జ‌లాల పెంపునకు కూడా ఈ కార్య‌క్ర‌మం ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. స‌మాజానికి, గ్రామానికి, శ్రామికుల‌కు కూడా ఈ ప‌థ‌కం వ‌ల్ల ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంద‌న్నారు. అర్హులైన వారికి జాబ్ కార్డులు అందించ‌డంతో పాటు పూర్తిస్థాయిలో వేత‌నం ల‌భించేలా ప‌నులు చేప‌ట్టి, అవి జ‌రిగేలా చూడ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు.

గ్రామీణ భార‌తం.. ఆర్థికంగా బలోపేతం…

వీబీ జీ రామ్ జీ ప‌థ‌కంతో గ్రామణ భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేత‌మ‌వుతుంద‌ని.. శ్రామికుల‌కు సుస్థిర ఉపాధితో పాటు బ‌హుళ ప్ర‌యోజ‌నాల మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి వీల‌వుతుంద‌ని శాస‌న‌స‌భ్యుడు వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్ అన్నారు. శ్రామికుల‌కు మంచి ఉపాధి క‌ల్పించ‌డంతో పాటు గ్రామీణ డొంక రోడ్లు, కాలువ‌లు, వర్షపు నీటి సంరక్షణ, మొక్కల పెంపకం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులను ప్రాధాన్యత ఆధారంగా చేపట్టి గ్రామాలను స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వివరించారు.

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అందిస్తున్న అవకాశాలను స‌ద్వినియోగం చేసుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్ పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో ఎంపీపీ ల‌క్ష్మీ తిరుప‌త‌మ్మ‌, డ్వామా పీడీ ఎ.రాము, ఏపీడీ (విజ‌య‌వాడ‌) శ్రీనివాస్‌, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమ‌ర్‌, ఎంపీడీవో రామ‌కృష్ణ, త‌హ‌శీల్దార్ రిబ్కా రాణి, స్థానిక నాయ‌కులు, ఉపాధి హామీ శ్రామికులు త‌దిత‌రులు పాల్గొన్నారు.