Telangana Job Issue | చర్చలకు వచ్చే దమ్ముందా..?
Telangana Job Issue | చర్చలకు వచ్చే దమ్ముందా..?
ఉద్యోగాల లెక్కలపై బహిరంగ చర్చకు రావాలని నిరుద్యోగ యువతి సవాల్..
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Telangana Job Issue | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ ఆడబిడ్డగా నేను సవాల్ చేస్తున్నాను… చర్చలకు వచ్చే దమ్ముందా? ఎక్కడికి వస్తారో చెప్పండి, మీరు ఇచ్చిన ఉద్యోగాల లెక్కలు అన్నీ బయటపెడతాం అంటూ ప్రియాంక అనే యువతి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామని ఇప్పుడు అనిపిస్తోందని ఆమె పేర్కొంది.
“తెలంగాణను కాంగ్రెస్ చేతిలో పెట్టి తప్పు చేశామని అనిపిస్తుంది. ఉద్యోగాలు అడిగితే చావమంటారా? చావడానికే మీకు ఓట్లు వేసామా?” అంటూ ఆమె ప్రశ్నించింది. ఎన్నికల సమయంలో మార్పు వస్తుందని ఆశించి కుటుంబంతో కలిసి ఓటు వేశామని, కానీ ప్రస్తుత పరిస్థితులు నిరాశ కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.
2014కు ముందు ఉన్న తెలంగాణ పరిస్థితులే మళ్లీ వస్తున్నాయనే భావన కలుగుతోందని ప్రియాంక అన్నారు. “రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అంటున్నారు, ఒకసారి 70 వేలు, మరోసారి 60 వేలు ఇచ్చామని చెబుతున్నారు. అసలు లెక్కలపై నాయకులకే క్లారిటీ లేదు” అని విమర్శించారు. నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, బహిరంగ చర్చకు రావాలని ఆమె సవాల్ విసిరారు.
సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కూడా ఆమె స్పందిస్తూ, “ఓటు వేసి గెలిపించినందుకే మమ్మల్ని చావమంటారా?” అని ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పష్టమైన గణాంకాలు బయటపెట్టి ప్రజలకు నిజం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
