సరి కొత్త గా గ్రామీణ ఉపాధి హామీ

వికసిత్ భారత్’ పథకాన్ని ప్రారంభించిన కొలికపూడి శ్రీనివాసరావు
లక్ష్మీపురంలో ‘వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్)’కు శ్రీకారం
ఉపాధి దినాలను 125 రోజులకు, రోజువారీ కూలీని రూ.312కు..
ప్రతి అర్హ కుటుంబానికి పథకాల లబ్ధి అందేలా అధికారులు పనిచేయాలి
గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపాధి పనులు దోహదం
మోదీ,చంద్రబాబు,పవన్ నాయకత్వంలో గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం..
ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు..

తిరువూరు, ఆంధ్రప్రభ : గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి, స్థిరమైన ఆదాయం కల్పించడంతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా అమలు చేస్తున్న ‘వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్)’ పథకాన్ని తిరువూరు నియోజకవర్గం లక్ష్మీపురంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గురువారం ప్రారంభించారు. ప్రతి అర్హ కుటుంబానికి ఈ పథకం ప్రయోజనాలు చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని లక్ష్మీపురం గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, వ్యవసాయ పనులు లేని కాలంలో గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి కల్పించి, వారికి స్థిరమైన ఆదాయం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో అమలైన ఈ కార్యక్రమం ప్రస్తుతం ‘వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్)’ పేరుతో కొనసాగుతున్నప్పటికీ, పథకం లక్ష్యం మాత్రం మారలేదని వివరించారు. గతంలో ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజుల ఉపాధి కల్పించగా, ప్రస్తుతం దానిని 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. అలాగే రోజువారీ కూలీని రూ.300 నుంచి రూ.312కు పెంచినట్లు పేర్కొన్నారు. ఈ మార్పులతో గ్రామీణ పేదలకు మరింత ఆర్థిక భరోసా లభిస్తుందని అన్నారు.

ఈ పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించడంతో పాటు కమ్యూనిటీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామీణ రహదారులు, ఇతర మౌలిక వసతుల నిర్మాణం కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు చేసే ఉపాధి పనుల ద్వారానే గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరుతున్నాయని, అందువల్ల ప్రతి అర్హ కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, మహిళా సంఘాలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం, కుటుంబాల జీవనోపాధిని బలోపేతం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గ్రామీణాభివృద్ధికి అనేక వినూత్న కార్యక్రమాలు అమలవుతున్నాయని, వాటి ప్రయోజనాలు ప్రతి గ్రామానికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో కుమార్, ఎంపీడీవో చి. రవిబాబు, సీనియర్ నాయకుడు నెక్కాడపు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ గొల్లమందల శ్రీనివాసరావు, ఏపీడీ కె. పార్థసారధి, ఏపీఓ మాధవరెడ్డి, ఈసీ విజయకుమార్, టెక్నికల్ అసిస్టెంట్ భాస్కరరావు, ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.