మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు
అమరావతి అంశంపై వైసీపీ అస్థిర వైఖరిపై విమర్శలు
కర్నూలు, ఆంధ్రప్రభ : రాజధాని అమరావతి అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పాలకవీటి విజయకుమార్ విమర్శించారు. కర్నూలులో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల్లో స్థిరత్వం కనిపించడం లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు తెలిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారని అన్నారు. ప్రస్తుతం “మావిగన్” పేరుతో మరో కొత్త వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
మూడు రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీకి ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని, ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారని పేర్కొన్నారు. ఇలాంటి అస్థిర రాజకీయాలతో ముందుకు వెళ్తే రానున్న ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ప్రజల మద్దతు లభించడం కష్టమేనని వ్యాఖ్యానించారు.
రాబోయే ఎన్నికలు అమరావతి, మావిగన్ మధ్య పోటీ కాదని, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే విజనరీ నాయకత్వానికి, రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టే రాజకీయాలకు మధ్య జరిగే పోటీ అని అన్నారు. అలాగే అభివృద్ధి–అరాచకం, సంక్షేమం–విధ్వంసం మధ్య ప్రజలు నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని విరమించుకోవాలని, లేకుంటే రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పాలకవీటి విజయకుమార్ హెచ్చరించారు.
విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెంపెంట రాంబాబు, కృష్ణాజీ రావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
