అనాథ యువకుడికి అండగా అన్నం ఫౌండేషన్
- సపర్యలు చేసి.. కొత్త బట్టలు తొడిగించి.. ఖమ్మంకు తరలింపు
- మానవత్వం చాటుకున్న వైనం
- ఎవ్వరు లేని వ్యక్తికి నేనున్నానను అంటూ బరోసా ఇచ్చిన అన్నం ఫౌండేషన్
- ఫౌండేషన్ శ్రీనివాస్ ను అభినందించిన తండా వాసులు
కేసముద్రం, ఆంధ్రప్రభ : నా అనే వారు లేరు… ముళ్ల చెట్టే 30 ఏండ్ల యువకుడికి ఆశ్రయం… అయింది. పక్షవాతంతో అనాథగా మారి నిస్సహాయంగా జీవనం సాగిస్తున్న వినోద్‌కు అన్నం ఫౌండేషన్ మానవత్వంతో చేయూతనిచ్చింది. పక్షవాతం కారణంగా కాళ్లు, చేతులు, నోరు పనిచేయని స్థితికి చేరుకున్న వినోద్ సమాజానికి దూరమై, జీవితం–మరణం మధ్య పోరాటం చేస్తూ కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని బడి తండాలో అత్యంత దయనీయ పరిస్థితుల్లో కనిపించాడు.వినోద్ పరిస్థితి గురించి తెలుసుకున్న అన్నం ఫౌండేషన్ వ్యవస్థపాకులు అన్నం శ్రీనివాస్ స్పందించారు. వెంటనే అక్కడికి చేరుకుని “నీవు ఒంటరివి కాదు… మేమున్నాం” అనే భరోసా కల్పించారు.
ప్రేమతో చేరదీసి…
*అపరిశుభ్రంగా, అనారోగ్యంతో ,చెత్త కుప్పల్లో ,చెట్టు కింద ఉన్న వినోద్ ను ప్రేమగా చేరదీసి, సపర్యలు చేసి, స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగించారు. అనంతరం ఆహారం అందించి, మెరుగైన వైద్య చికిత్స, సంరక్షణ కోసం ఖమ్మంకు తరలించారు.
అందరినీ కదలించిన అన్నం ఫౌండేషన్ సేవలు …
ఒక నిరాశ్రేయుణ్ణి కళ్లలో మళ్లీ ఆశ వెలిగించిన అన్నం ఫౌండేషన్ సేవలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించాయి. రక్తసంబంధాలు దూరమైన చోట మానవత్వమే బంధువుగా మారి, ప్రేమతో చేయూతనిస్తే ఒక జీవితాన్ని నిలబెట్టవచ్చని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.
నిరాధారులు, అనాథలు, ఆపన్నులకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని పరిమళింపజేస్తున్న అన్నం ఫౌండేషన్ సేవలను స్థానికులు హృదయపూర్వకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ దేవేందర్ అరుణ కుమారి , మోహన్సం జు ,చిన్నా, కళ్యాణ్ ,వినోద్, బాల్ సింగ్ పాల్గొన్నారు.
