ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి..

  • పీఆర్టీయూ టీఎస్

జైనూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పీఆర్టీయూ టీఎస్‌తోనే సాధ్యమని ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఆడే ప్రకాష్ అన్నారు. గురువారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో పీఆర్టీయూ టీఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిర్వహించారు.

అనంతరం జరిగిన సమావేశంలో ఆడే ప్రకాష్ మాట్లాడుతూ, ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏ, జీపీఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐ, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే జూలై-2023 నుంచి అమలు కావాల్సిన వేతన సవరణను తక్షణమే అమలు చేయాలని కోరారు.

ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో ప్రమోషన్ పొందిన ప్రధానోపాధ్యాయులను బీఈడీ కళాశాలలకు డిప్యుటేషన్‌పై పంపడం వల్ల పాఠశాలల్లో ఇన్‌చార్జి హెచ్‌ఎంలపై అదనపు భారం పడుతోందని, దీంతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందడం లేదని అన్నారు. అటువంటి పాఠశాలల్లో వెంటనే సబ్జెక్టు సీఆర్‌టీలను నియమించాలని డిమాండ్ చేశారు.

సిర్పూర్ (యూ) మండలంలోని మహాగాం బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో రెగ్యులర్ పీజీ హెచ్‌ఎంను నియమించాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రతి హాస్టల్‌కు వార్డెన్ పోస్టులను మంజూరు చేయాలని, కేజీబీవీల్లో పనిచేస్తున్న సీఆర్‌టీలకు హెల్త్ కార్డులు వర్తింపజేయాలని, సమ్మర్ సెలవుల్లో పనిచేసిన సిబ్బంది వేతనాల్లో కోత విధించడం సరికాదని అన్నారు.

అలాగే ట్రైబల్ వెల్ఫేర్‌లో పనిచేస్తున్న సీఆర్‌టీల వేతనాలను వెంటనే విడుదల చేసి, ప్రతి నెల మొదటి తేదీన జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఉషేగాం, పోచంలొద్ది, జైనూర్ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ జైనూర్ మండల శాఖ అధ్యక్షుడు తులసిరాం, ప్రధాన కార్యదర్శి రాథోడ్ రవీందర్, జాదవ్ మధుకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.