కవర్ కప్పి కవరింగ్..! కొమురం భీం ప్రాజెక్ట్ భద్రతపై ప్రశ్నలు

పగుళ్లతో ప్రమాదకరంగా ఆనకట్ట..

మరమ్మతుల్లో జాప్యంపై ప్రజల్లో ఆందోళన

ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమురం భీం ప్రాజెక్టు ఆనకట్టకు పగుళ్లు ఏర్పడి చాలా కాలం గడుస్తున్నా శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మట్టి ఆనకట్టకు తాత్కాలికంగా కవర్లు వేసి సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నమే తప్ప శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో ఆనకట్ట పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందేమోనన్న భయంతో ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఆసిఫాబాద్, వాంకిడి, కాగజ్‌నగర్, సిర్పూర్(టి) మండలాల పరిధిలోని 69 గ్రామాలకు చెందిన సుమారు 45,500 ఎకరాల సాగుభూములకు నీరందించాలనే లక్ష్యంతో కొమురం భీం ప్రాజెక్టును నిర్మించారు. సుమారు 10.393 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో, తొమ్మిది గేట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో రైతులకు ప్రయోజనం చేకూరడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురవడంతో నీటి నిల్వలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది.

ప్రాజెక్టు నుంచి ఆయకట్టు గ్రామాలకు నీరు చేరాల్సిన కాలువల్లో పూడిక పేరుకుపోవడం, పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో సాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆనకట్టలో ఏర్పడిన పగుళ్లపై గతంలో ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పలుమార్లు పరిశీలించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు నిధులు మంజూరు కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టు పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని ఆరోపిస్తున్నారు.

ఇక ప్రాజెక్టు ముంపు భూములు, శిఖం భూములు కూడా అక్రమ ఆక్రమణలకు గురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముంపు భూములకు ఇప్పటికే పరిహారం పొందిన కొందరు వ్యక్తులు తిరిగి ఆ భూముల్లో సాగు చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయలతో నిర్మించిన కొమురం భీం ప్రాజెక్టు లక్ష్యాలను నెరవేర్చాలంటే ఆనకట్టకు శాశ్వత మరమ్మతులు చేపట్టడంతో పాటు కాలువల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.