సీఎం రేవంత్ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ పర్యటన..
రూ.11.5 కోట్ల అభివృద్ధి వరాలు ప్రకటించే అవకాశం
ముఖ్యమంత్రి రాకతో ఆలయానికి మహర్దశ.. భక్తుల్లో భారీ అంచనాలు
ఉర్కొండ, ఆంధ్రప్రభ: నాగర్కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం ఊర్కొండపేట శివారులోని ప్రసిద్ధ శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 4న సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారిగా ఈ ఆలయానికి రానుండటంతో భక్తులు, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సుమారు రూ.11.5 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రకటించనున్నట్లు దేవాదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో ఆలయ అభివృద్ధి కొత్త దశలోకి అడుగుపెడుతుందనే ఆశాభావం భక్తుల్లో వ్యక్తమవుతోంది.
దేవాలయ అభివృద్ధిలో భాగంగా సింధూర గణపతి ఆలయ నిర్మాణానికి రూ.26 లక్షలు, కానేరు నిర్మాణానికి రూ.50 లక్షలు, భక్తుల సౌకర్యాల విస్తరణకు రూ.20 లక్షలు, నవగ్రహ మండపానికి రూ.6 లక్షలు, కేశఖండన భవనం, రెండు నీటి ట్యాంకుల నిర్మాణానికి రూ.95 లక్షలు, సత్యనారాయణ స్వామి వ్రత మండపానికి రూ.1.20 కోట్లు, శివాలయ అభివృద్ధికి రూ.30 లక్షలు, అన్నదాన సత్రానికి రూ.70 లక్షలు, ఘాట్ రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. వీటితో పాటు ఆలయ పరిసరాల్లో మౌలిక వసతుల కల్పన, భక్తులకు అవసరమైన సదుపాయాల విస్తరణకు కూడా నిధులు వినియోగించనున్నారు.
ఉర్కొండపేటలోని ఈ పురాతన దేవాలయానికి ప్రతి మంగళవారం, శనివారం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే కనీస మౌలిక సదుపాయాల కొరతతో భక్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించనున్న నిధులతో ఆలయ రూపురేఖలు పూర్తిగా మారడంతో పాటు భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఘాట్ రోడ్డు, అన్నదాన సత్రం, వ్రత మండపం నిర్మాణం పూర్తయితే యాత్రికులకు ఎంతో ప్రయోజనం కలగనుంది.
ఈ ఆలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. 2006లో జడ్పీటీసీగా పోటీ చేసే ముందు, అనంతరం ఎమ్మెల్యేగా తొలిసారి నామినేషన్ దాఖలు చేసే సందర్భంలోనూ ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలిసారి ఆలయాన్ని సందర్శించనుండటంతో భక్తుల్లో ప్రత్యేక ఉత్సాహం నెలకొంది. ఈ పర్యటనతో ఆలయ అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని, పర్యాటకంగా కూడా ఈ క్షేత్రం మరింత ప్రాధాన్యం పొందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
