గ్రామాభివృద్ధికి వీబీజీ రామ్‌ జీ చారిత్రాత్మక సంస్కరణ

  • ఉపాధి, మౌలిక సదుపాయాలు, నీటి భద్రత, ఆదాయ వృద్ధిపై ప్రత్యేక దృష్టి
  • కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో గ్రామాల్లో రూ.11 వేల కోట్ల అభివృద్ధి పనులకు అవకాశం
  • ఆధార్, డీబీటీ, జియో ట్యాగింగ్‌తో పెరిగిన పారదర్శకత
  • గత రెండేళ్లలో ఏపీకి రూ.20 వేల కోట్ల కేంద్ర నిధులు
  • పల్లె బలపడితేనే దేశం బలపడుతుంది
  • వీబీజీ రామ్‌ జీ ప్రారంభోత్సవంలో పెమ్మసాని చంద్రశేఖర్

తిరుపతి, ఆంధ్ర‌ప్ర‌భ : గ్రామీణాభివృద్ధికి కొత్త దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీజీ-రామ్‌జీ) చారిత్రాత్మక సంస్కరణ అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 2006లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభమైందని ఆయన గుర్తు చేశారు. అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో దేశంలోనే తొలి జాబ్‌కార్డును దళిత మహిళ చీమల పెదక్కకు అందించారని చెప్పారు. రాయలసీమ వంటి కరువు ప్రాంతాల్లో వ్యవసాయ విరామ సమయంలో గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించి, వలసలను తగ్గించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించిందన్నారు.

కొన్ని రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా అమలైందని, 2014 నుంచి 2019 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పలు శాఖల నిధులను సమన్వయం చేసి గ్రామాల్లో సిమెంట్ రహదారులు నిర్మించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో కూడా రహదారుల నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. అయితే కాలక్రమేణా కొన్ని రాష్ట్రాల్లో పథకం దుర్వినియోగానికి గురైందని, సరైన ప్రణాళికలు లేకుండా పనులు చేపట్టడం, శాశ్వత ప్రయోజనం లేని ఆస్తుల నిర్మాణం, నకిలీ జాబ్‌కార్డులు, అక్రమ చెల్లింపులు, అనుమతులు లేని పనులు, సామాజిక ఆడిట్లలో నిర్లక్ష్యం వంటి అంశాలను కాగ్ తన నివేదికల్లో ప్రస్తావించిందన్నారు.

ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పథకంలో పలు సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. ఆధార్ అనుసంధానం ద్వారా 4.40 కోట్ల నకిలీ జాబ్‌కార్డులను తొలగించామని, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా 98 శాతం మంది శ్రామికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నామని చెప్పారు. శాటిలైట్ జియో ట్యాగింగ్ ద్వారా పనుల అమలులో పారదర్శకత పెరిగిందన్నారు. ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి రూ.90 వేల కోట్ల వరకు వ్యయం చేస్తున్నప్పటికీ గ్రామాల్లో ఆశించిన స్థాయిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కాలేదన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో శాశ్వత అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని వీబీజీ-రామ్‌జీ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు.

ఈ పథకం నాలుగు ప్రధాన స్తంభాలపై ఆధారపడి ఉందన్నారు. ఉపాధి కల్పన, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, నీటి భద్రత, యువత, రైతులు, స్వయం సహాయక సంఘాల ఆదాయ వృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. బస్ షెల్టర్లు, పంచాయతీ భవనాలు, తరగతి గదులు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్‌వాడీలు, ఆరోగ్య కేంద్రాలు, రహదారులు, డ్రైన్లు, చెరువులు, చెక్‌డ్యాంలు, కోల్డ్ స్టోరేజీలు, గోదాములు, పాల సేకరణ కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు వంటి 300కు పైగా పనులను ఈ పథకంలో చేర్చినట్లు తెలిపారు. ఇకపై పథకం వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 40 శాతం వాటా భరించే విధానం అమల్లోకి వస్తోందని చెప్పారు. ఇది భారంగా కాకుండా బాధ్యతగా స్వీకరిస్తే అభివృద్ధి పనుల్లో జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు ఉపాధి హామీ పథకం కింద కేంద్రం రూ.7,500 కోట్లు ఇచ్చిందని, రాష్ట్ర వాటాతో కలిపి ఈ ఏడాది గ్రామాల్లో సుమారు రూ.11 వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉందన్నారు.

గత రెండేళ్లలో ఉపాధి హామీ, స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ రహదారులు, వాటర్‌షెడ్ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభివృద్ధి వంటి పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు సుమారు రూ.20 వేల కోట్ల కేంద్ర నిధులు వచ్చాయని తెలిపారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ పనుల రూ.180 కోట్ల బిల్లులను మళ్లీ విడుదల చేయించామని చెప్పారు. గ్రామసభల ద్వారా ప్రతి గ్రామానికి అవసరమైన పనులను నిర్ణయించాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, శ్రామికులు, మహిళలు కలిసి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పల్లెలు బలపడితేనే దేశం బలపడుతుందని, గ్రామాలను ఆర్థిక శక్తి కేంద్రాలుగా తీర్చిదిద్దడమే వీబీజీ-రామ్‌జీ లక్ష్యమని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.