BRSWorkingPresident | హరీష్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం..
BRSWorkingPresident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: రాష్ట్ర అప్పులు, గురుకులాల్లో అవినీతి అంశాలపై చర్చకు రావాలని తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే సవాల్ చేశారని, తాము ఆ సవాల్‌ను స్వీకరించిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేకపోవడంపై విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి స్పందించకపోవడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్యలోకి వచ్చి తెలంగాణ భవన్‌కు వచ్చి చర్చిస్తామని చెప్పారని, అందుకే ఆయన కోసం ఎదురుచూశామని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు గన్‌పార్క్‌కు రావాలని చెబుతున్నారని, అక్కడికి వెళ్లిన తర్వాత మరో చోటుకు పిలుస్తారేమో అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌కు వస్తామని చెప్పిన మంత్రి గన్‌పార్క్‌కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.
గన్‌పార్క్‌కు వెళ్తున్న హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎందుకు అడ్డుకుని అరెస్ట్ చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. హరీష్ రావుతో పాటు అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో తమ ప్రభుత్వం లక్ష ఇళ్లను నిర్మించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు నిర్మించినా చర్చకు సిద్ధమని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం దేనిపైనా చర్చించేందుకు సిద్ధంగా లేదని, చేతకాకపోతే సవాళ్లు ఎందుకు విసిరారని విమర్శించారు. అలాగే రాష్ట్ర అప్పులు, గురుకులాల్లో అవినీతి అంశాలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ సమావేశాల్లో ప్రతిపక్షానికి పూర్తి అవకాశం కల్పించి అన్ని అంశాలపై చర్చించనివ్వాలని కోరారు.
