దారుణ ఘటన.. నిద్రిస్తున్న వృధ్ధురాలి గొంతు నులిమి హత్య

  • ఇంట్లోని బంగారం, వెండి అపహరణ

కోహెడ, ఆంధ్రప్రభ: కోహెడ మండలంలోని పోరెడ్డిపల్లె గ్రామ పరిధిలోని అప్పిస కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పిస బుచ్చమ్మ (80) అనే వృద్ధురాలు గత రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు సమాచారం. హత్య అనంతరం దుండగులు ఆమె మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు గొలుసుతో పాటు కాళ్లకు ఉన్న 50 తులాల వెండి కడాలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కోహెడ ఎస్సై పుల్ల అభిలాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.