క్రీడాప్రాంగణంలో ప్లాట్ల కలకలం
- అక్కారం గ్రామంలో సర్పంచ్‌పై ఆరోపణలు
- సర్వే నెంబర్ 102 భూమిపై వివాదం
- ప్లాట్‌కు రూ.15 వేల నుంచి రూ.30 వేల వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు
- ఆరోపణల్లో నిజం లేదంటున్న సర్పంచ్ లాలు
అచ్చంపేట, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం, అక్కారం గ్రామపంచాయతీలో సర్వే నెంబర్ 102లో ఉన్న భూమిపై వివాదం చెలరేగింది. పేదలకు ఇంటి స్థలాల కేటాయింపునకు ఉద్దేశించిన భూమిలో అక్రమంగా ప్లాట్లు విక్రయిస్తున్నారని గ్రామస్తులు ప్రస్తుత సర్పంచ్ కొర్ర లాలుపై ఆరోపణలు చేస్తున్నారు.
గ్రామస్తుల వివరాల ప్రకారం.. సుమారు 15 సంవత్సరాల క్రితం ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని ఇల్లు లేని పేదలకు ప్లాట్లు కేటాయించేందుకు రెవెన్యూ శాఖకు అప్పగించింది. అనంతరం ఆ భూమిలో కొంత భాగాన్ని క్రీడా ప్రాంగణంగా కేటాయించినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాంగణాన్ని తొలగించి ప్లాట్లుగా మార్చి విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
బుధవారం ఈ వ్యవహారంపై గ్రామ ప్రజలు సర్పంచ్‌ను ప్రశ్నించారు. ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాల్సిన ఇంటి స్థలాలకు డబ్బులు వసూలు చేయడం ఏంటని నిలదీయగా, గ్రామస్తులు, సర్పంచ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ప్లాట్‌కు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాక, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తాను భారీగా ఖర్చు చేశానని, ఆ డబ్బును తిరిగి రాబట్టుకోవడానికి ఈ ప్లాట్లను విక్రయిస్తున్నానని సర్పంచ్ అంటున్నట్లుగా సమాచారం.
గత ప్రభుత్వ కాలంలో మాజీ సర్పంచ్ ఈ రెండు ఎకరాల భూమిలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారని గ్రామస్తులు గుర్తు చేస్తుండగా, ప్రస్తుత సర్పంచ్ జేసీబీలతో ఆ ప్రాంగణాన్ని తొలగించి అందులో ప్లాట్లు చేసి రాళ్లు పాతారని గ్రామస్తులు అంటున్నారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా విక్రయించి డబ్బులు సంపాదించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
ఆరోపణలలో వాస్తవం లేదు….
ఈ ఆరోపణలపై స్పందించిన సర్పంచ్ కొర్ర లాలు, తనపై వస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండించారు. రెండు నెలల క్రితం గ్రామ తీర్మానం చేసి, “గ్రామంలో సర్వే నెంబర్ 102లో 36 ప్లాట్లు చేసిన విషయం నిజమే. అయితే అవి గ్రామంలో ఇల్లు లేని నిరుపేదల కోసం మాత్రమే. గ్రామస్తుల సమక్షంలో 70 మంది అర్హులను గుర్తించాం. అక్రమ వసూళ్ల ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు” అని స్పష్టం చేశారు.
గ్రామపంచాయతీ తీర్మానం లేదు
ఇదే విషయమై అక్కడ విధులు నిర్వహించిన గ్రామ కార్యదర్శి సాయిరాం ను ఫోన్లో వివరణ కోరగా తాను అక్కడ విధులు నిర్వహించినన్ని రోజులు ఇట్టి ప్లాట్లకు సంబంధించి ఎలాంటి తీర్మానం చేయలేదని తెలిపారు.
