బాల్య వివాహాలు, బాల కార్మిక నిర్మూలనకు శాఖల సమన్వయం కీలకం

కర్నూలును బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ ఏవీఎస్ సూర్యనారాయణ రాజు

కర్నూలు, ఆంధ్రప్రభ: కర్నూలు జిల్లాను బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, సంక్షేమ పథకాల అమలుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

గ్రామ, వార్డు స్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను చురుకుగా పనిచేయించి బాల్య వివాహాలు, బాల కార్మికులు, డ్రాప్‌అవుట్ విద్యార్థులపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, బాలల భిక్షాటన నిర్మూలనకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

కమిషన్ సభ్యుడు డా. ధోని శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ జిల్లాలో పౌష్టికాహార లోపం, టీనేజ్ గర్భధారణ నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో మౌలిక వసతులు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, ఆరోగ్య సేవలను మెరుగుపర్చాలని, బాలికలకు హెచ్‌పీవీ టీకాల పంపిణీని 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.

అలాగే బాల కార్మికులను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా దేవనకొండ మండలంలోని ఓ పాఠశాల సమస్యపై వెంటనే స్పందించి రూ.16 లక్షలు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ చొరవను కమిషన్ సభ్యులు అభినందించారు.

ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు చల్లా మధుసూదన్‌రావు, జిల్లా అదనపు ఎస్పీ హుసేన్ పీరా, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విజయతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.