విద్యారంగ సమస్యలపై విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలి..

కర్నూలు, ఆంధ్రప్రభ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు జి. ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని టీజీఆర్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం ప్రారంభమైన ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి విద్యా–వైజ్ఞానిక–రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, జీవో నంబర్–77 రద్దు, సంక్షేమ వసతి గృహాల సమస్యలు, కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీకేజీలు జరుగుతున్నప్పటికీ వాటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యను కాషాయీకరించే ప్రయత్నాలను విద్యార్థులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్ జీ, ఏఐవైఎఫ్ నాయకులు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.