ఇంటింటి ఓటర్ సర్వే.. గ్రామస్తులకు ఫారాలు అందజేత
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ నమోదు (ఎస్‌ఐఆర్) ప్రక్రియను నెల రోజుల పాటు కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మునిగడప లావణ్య, బీఎల్‌ఓ పాలడుగుల ఉమాదేవి తెలిపారు.
బుధవారం ఎల్కతుర్తి గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఏడవ రోజు ఇంటింటి సర్వే నిర్వహించి గ్రామస్తులకు ఫారాలు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మునిగడప లావణ్య మాట్లాడుతూ గ్రామస్థులు ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఓటరు జాబితాను సమగ్రంగా సవరించే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం, 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్లను నమోదు చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ సీనియర్ జర్నలిస్ట్ జనగాని ప్రవీణ్ గౌడ్, బీఎల్‌ఓ ఉమాదేవి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
