బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి
- మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్
- ఓటర్ల జాబితా సవరణపై పలు సూచనలు
- ముఖ్య అతిథిగా మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కు నమోదు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు.
పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రామచంద్రపురంలోని బాలాజీ గార్డెన్స్‌లో బుధవారం నిర్వహించిన ప్రత్యేక ముసాయిదా ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా మార్పులు, చేర్పులు జరగాలని సూచించారు.
బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించే సమయంలో పొరపాట్లు జరగకుండా చూసే బాధ్యత బీఎల్ఏలపై ఉందన్నారు. మరణించిన వారి పేర్లు, ఒకే వ్యక్తి పేరుతో రెండు చోట్ల నమోదైన బోగస్ ఓట్లను గుర్తించి జాబితాను ప్రక్షాళన చేయాలని సూచించారు. అలాగే 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి యువతి, యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు అయ్యేలా చొరవ చూపాలని పిలుపునిచ్చారు.
అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ముసాయిదా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రతి ఒక్కరికీ పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితా పక్కాగా ఉండేలా బీఎల్ఏలు, బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.
అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, తమ ఓటు వివరాలను పరిశీలించుకుని అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ఫారాల భర్తీ, ఆన్లైన్, ఆఫ్‌లైన్ దరఖాస్తుల పరిశీలన, ఇతర సాంకేతిక అంశాలపై ప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలజగ్గారెడ్డి, పీసీసీ కోఆర్డినేటర్ డాక్టర్ జీడీ వెన్నెల, పీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధ, కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
