Stock Market Today | 444 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్.. 24 వేల మార్క్ దాటిన నిఫ్టీ..

Stock Market Today | 444 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్.. 24 వేల మార్క్ దాటిన నిఫ్టీ..

Stock Market Today | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, రియల్టీ రంగాల షేర్లలో బలమైన కొనుగోళ్లు నమోదవడంతో కీలక సూచీలు రోజంతా సానుకూలంగా కదిలాయి.

ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 443.97 పాయింట్లు (0.58 శాతం) లాభపడి 76,922.64 వద్ద, నిఫ్టీ 140.10 పాయింట్లు (0.59 శాతం) పెరిగి 24,005.85 వద్ద స్థిరపడింది. దీంతో నిఫ్టీ మరోసారి 24 వేల మార్కును అధిగమించింది.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, నిఫ్టీకి 24,100–24,200 స్థాయిలు తక్షణ నిరోధకంగా ఉన్నాయి. ఈ స్థాయిని అధిగమిస్తే సూచీ 24,400 వరకు చేరే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మరోవైపు 23,900–23,800 స్థాయిలు కీలక మద్దతు జోన్‌గా పనిచేసే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

నిఫ్టీలో ఎటర్నల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, నెస్లే ఇండియా టాప్ గెయినర్లుగా నిలిచి మార్కెట్‌కు మద్దతు ఇచ్చాయి. విస్తృత మార్కెట్ కూడా సానుకూలంగా ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.34 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.36 శాతం లాభాలను నమోదు చేశాయి.

రంగాల వారీగా చూస్తే రియల్టీ సూచీ అత్యధిక లాభాలను నమోదు చేయగా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగాలు కూడా మంచి ప్రదర్శన కనబరిచాయి. అయితే ఐటీ, మెటల్, ఫార్మా రంగాల సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి.

2026 క్యాలెండర్ సంవత్సర రెండో అర్ధభాగంలోకి మార్కెట్లు ఆశాజనక వాతావరణంలో అడుగుపెట్టాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న సానుకూల అంచనాలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అదుపులో ఉండటం వంటి అంశాలు మదుపర్ల విశ్వాసాన్ని పెంచాయని వారు విశ్లేషిస్తున్నారు.