లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్లు
- చెర్లోపల్లిలో పెన్షన్ల పంపిణీని తనిఖీ
- లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్
తిరుపతి, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను ప్రతి నెలా క్రమం తప్పకుండా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సచివాలయ సిబ్బందికి సూచించారు.బుధవారం తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడి ప్రతి నెల ఒకటో తేదీన ఇంటి వద్దకే పెన్షన్లు అందుతున్నాయా అని ఆరా తీశారు. సచివాలయ సిబ్బంది క్రమం తప్పకుండా ఉదయాన్నే ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు అందజేస్తున్నారని లబ్ధిదారులు తెలిపారు.
జిల్లాలో మొత్తం 2,61,738 మంది లబ్ధిదారులకు రూ.113.35 కోట్ల ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. చెర్లోపల్లి గ్రామంలో వృద్ధాప్య, వితంతు పెన్షన్ల కింద రూ.4 వేల చొప్పున లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం పెన్షన్‌దారుల ఆరోగ్య పరిస్థితి, ఇతర సమస్యలపై కలెక్టర్ ఆరా తీశారు. స్థానిక సమస్యలను సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలని, ప్రభుత్వం నిర్వహించే వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మస్తాన్ వలి, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
