మర్రికుంట సాగర్ కెనాల్‌పై కొత్త బ్రిడ్జి నిర్మించాలి: సీపీఐ

గరిడేపల్లి, ఆంధ్రప్రభ: నాగార్జునసాగర్ మెయిన్ కెనాల్‌పై మర్రికుంట వద్ద ఉన్న పాత, ఇరుకు వంతెన స్థానంలో ప్రస్తుత ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా కొత్త బ్రిడ్జిని నిర్మించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పోకల వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ గరిడేపల్లి మండల సమితి ఆధ్వర్యంలో బుధవారం కెనాల్‌పై ఉన్న వంతెన వద్ద రాస్తారోకో నిర్వహించి ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా పోకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఇరుకు వంతెనపై ఒకేసారి ఒక వాహనం మాత్రమే వెళ్లే పరిస్థితి ఉందన్నారు. ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగి పలువురు గాయపడటమే కాకుండా కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వాలు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని వెంటనే నిధులు మంజూరు చేసి కొత్త బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని కోరారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి త్రిపురం సుధాకర్ రెడ్డి, నాయకులు ఆకుల శ్రీను, అంబటి గోవిందరెడ్డి, పంగా ఈదయ్య, యాట సైదులు, నందిపాటి కరుణాకర్, నందిపాటి చిన్నకాశయ్య, చింతకాయల కొండలు తదితరులు పాల్గొన్నారు.