మహిళా సంఘాలకు రూ.1.50 కోట్ల రుణాల పంపిణీ
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం పిప్రి (జె), బాచన్పల్లి గ్రామాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పల్లికొండ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రూ.1.50 కోట్ల విలువైన రుణాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులకు రుణ మంజూరు పత్రాలను బ్యాంకు అధికారులు అందజేశారు. బ్యాంకు అధికారులు మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి రంగంలో ముందుకు సాగేందుకు, చిన్న వ్యాపారాలు, పాడి పరిశ్రమ, కిరాణా దుకాణాలు, కుట్టు కేంద్రాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను అభివృద్ధి చేసేందుకు ఈ రుణాలు ఉపయోగపడతాయని తెలిపారు. రుణాలను సద్వినియోగం చేసుకొని కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
ఐకేపీ అధికారులు మాట్లాడుతూ మహిళా సంఘాలు రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తూ మంచి క్రెడిట్ చరిత్రను కొనసాగించాలని, తద్వారా భవిష్యత్తులో మరింత అధిక మొత్తంలో రుణాలు పొందే అవకాశం ఉంటుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ శ్రవణ్ కుమార్, ఐకేపీ సీసీ పురస్తు నరేష్, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ సంఘాల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
