పట్టణంలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు
ఆలేరు, ఆంధ్రప్రభ: డాక్టర్స్ డే సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో భజరంగ్ యూత్ ఆధ్వర్యంలో బుధవారం పలువురు వైద్యులను ఘనంగా సన్మానించారు. సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ స్వప్న రాథోడ్, డాక్టర్ సౌజన్య, డాక్టర్ ఎం. ప్రతాప్ రెడ్డిలకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వైద్యులు సమాజానికి అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, వారి సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు భజరంగ్ యూత్ సభ్యులు తెలిపారు.
డాక్టర్ ప్రతాప్ రెడ్డికి సన్మానం

ఈ సందర్భంగా ఆలేరుకు చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ ఎం. ప్రతాప్ రెడ్డిని పలువురు వైద్యులు ప్రత్యేకంగా శాలువా కప్పి సన్మానించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. వైద్య రంగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులోనూ ప్రజలకు ఇదే విధంగా సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భజరంగ్ యూత్ అధ్యక్షుడు సీస శివ, బరిగె వెంకటేష్, కంసాని మహేష్, రుద్రవీణ సందీప్, మొరిగాడి వివేక్, జూకంటి నవీన్, సిద్ధగొని శ్రవణ్, కందుల శరత్, లక్కాకుల శివ, లక్కాకుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
