Central University | ప్రధాని మోడీజీ స్ఫూర్తి
స్వర్ణాంధ్ర -2047 దిశగా చంద్రబాబు అడుగులు
ఇన్నోవేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ గమ్యస్థానంగా ఏపీ!
లక్షలాది మంది భారతీయ యువతకు స్ఫూర్తి రాష్ట్రపతి ముర్ము జీవితం
సౌకర్యవంతమైన మార్గాన్ని ఎంచుకునే వారికి విజయం దక్కదు
ఉద్యోగార్థులుగా కాదు… ఉద్యోగాల సృష్టికర్తలుగా యువత ఎదగాలి
అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ తొలి కాన్వకేషన్ లో మంత్రి లోకేష్
Central University | అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ దూరదృష్టి గల నాయకత్వంలో భారతదేశ జాతీయ విద్యా విధానం , డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, వికసిత్ భారత్ 2047 దార్శనికత ద్వారా విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తున్నారు. ఈ స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర – 2047 దిశగా అడుగులు వేస్తున్నారు. తద్వారా విద్య, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలను సృష్టించగల, భవిష్యత్తుకు సంసిద్ధమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అనంతపురంలోని ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఈరోజు యువ పట్టభద్రులతో నిండిన ఈ సభను చూస్తున్నప్పుడు… నాకు కేవలం పట్టాలు స్వీకరిస్తున్న విద్యార్థులు మాత్రమే కనిపించడం లేదు. భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్న ఒక తరం కనిపిస్తోంది. ప్రతి తరానికీ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. భవిష్యత్తును నిర్మించే అవకాశం ఈ తరానికి లభించింది. ఇది మీ సమయం, ఇది మీకు లభించిన గొప్ప అవకాశం. మీ నేపథ్యం మీ భవిష్యత్తును నిర్ణయించేలా ఎప్పుడూ అనుమతించకండి. మీ కలలు, మీ కఠోర శ్రమ, మీ వ్యక్తిత్వం… ఇవే మీరు ఎవరన్నదానిని నిర్వచించేలా చూసుకోండి.
ముర్ము జీవితం… స్ఫూర్తిదాయకం
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తో కలిసి ఇక్కడ కూర్చునే భాగ్యం మనకు దక్కింది. ఆమె జీవితం కేవలం తరగతి గదిలో నేర్వలేని ఒక పాఠం. ఆమె ఒక చిన్న గిరిజన గ్రామంలో జన్మించారు. చాలా మందిలాగే కుంగదీసే వ్యక్తిగత విషాదాలను ఆమె ఎదుర్కొన్నారు. అయినా ఆమె ఎన్నడూ విశ్వాసం కోల్పోలేదు… సేవ చేయడం ఆపలేదు… ముందుకు సాగడం ఆపలేదు. ఒక ఉపాధ్యాయురాలిగా… ఒక శాసనసభ్యురాలిగా… ఒక గవర్నర్గా… ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాష్ట్రపతిగా మన ముందున్నారు.
ఆమె ప్రయాణం ప్రతి యువ విద్యార్థికి ఒక సత్యాన్ని చెబుతుంది… మీ ప్రారంభం మీ గమ్యాన్ని నిర్ణయించదు. మీ ధైర్యమే నిర్ణయిస్తుంది. భారత రాష్ట్రపతి ఒక చిన్న గిరిజన గ్రామం నుండి రాష్ట్రపతి భవన్కు ఎదగగలిగితే… మీ విద్య మీకు ఏమి సాధించడంలో సహాయపడుతుందో ఊహించండి. మేడమ్ జీవితం లక్షలాది మంది భారతీయ యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.
తొలి బ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది
ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవానికి హాజరవ్వడం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ప్రతి స్నాతకోత్సవం ప్రత్యేకమైనదే… కానీ మొదటి స్నాతకోత్సవం ఎప్పటికీ చారిత్రాత్మకమైనది. ప్రతి సంవత్సరం డిగ్రీలు ప్రదానం చేస్తారు… కానీ చరిత్ర ఒక్కసారే లిఖించబడుతుంది. రాబోయే సంవత్సరాలలో ఈ విశ్వవిద్యాలయం నుండి వేలాది మంది విద్యార్థులు పట్టభద్రులవుతారు. కానీ కేవలం ఒకే ఒక్క బ్యాచ్ మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోతుంది… అదే మొదటి బ్యాచ్. ఆ గౌరవం… ఆ వారసత్వం… మీకే చెందుతుంది. ప్రతి పట్టభద్రుడికి, ప్రతి స్వర్ణ పతక విజేతకు నా హృదయపూర్వక అభినందనలు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ కేవలం ఒక విద్యా ప్రాంగణం మాత్రమే కాదు, అదొక హామీ. నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి యువ మేధస్సుకు కలలు కనే, నేర్చుకునే, విజయం సాధించే అవకాశం దక్కాలన్న హామీ అది. నేడు… ఇక్కడ కూర్చున్న ప్రతి పట్టభద్రుడి రూపంలో ఆ హామీ కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది.
మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ గమ్యస్థానంగా ఎపి
ప్రపంచం మునుపెన్నడూ లేనంత వేగంగా మారుతోంది. కొత్త టెక్నాలజీ రూపాంతరం చెందుతూనే ఉంటుంది. కానీ పోటీతత్వ ప్రయోజనం కేవలం సాంకేతికత మాత్రమే కాదు.
అది ఎల్లప్పుడూ జిజ్ఞాస, సృజనాత్మకత, ధైర్యం, నిరంతరం నేర్చుకోవాలనే తపనతో కూడుకుని ఉంటుంది. నిరంతరం నేర్చుకుంటూ, పరిస్థితులకు అనుగుణంగా మారుతూ, మార్పునకు నాయకత్వం వహించే ధైర్యవంతులదే భవిష్యత్తు. ఎందుకంటే భవిష్యత్తు టెక్నాలజీని ప్రతిఘటించేవారిది కాదు, దానిని నేర్చుకుని, పరిస్థితులకు అనుగుణంగా మారి, నూతన ఆవిష్కరణలు చేసేవారిదే. అందుకే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైతన్యవంతమైన నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ రంగాలకు గమ్యస్థానంగా మారుతోంది. యువ భారతీయులకు ఇది ఎంతో ఉత్సాహభరితమైన సమయం ఇది. సాంకేతికత, తయారీ, పరిశోధన, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమ వంటి రంగాల్లో కొత్త అవకాశాలు ఆవిర్భవిస్తున్నాయి.
అవకాశాలు సృష్టించే వారు కావాలి
నేటి ప్రపంచానికి అవకాశాల కోసం ఎదురుచూసే వారు అవసరం లేదు. అవకాశాలను సృష్టించే వారు కావాలి. కేవలం ఉద్యోగార్థులుగా ఉండాలని ఆశించవద్దు. ఉద్యోగ సృష్టికర్తలుగా మారండి. సంస్థలను నిర్మించండి. ఆవిష్కరణలను నిర్మించండి. పరిష్కారాలను రూపొందించండి. ఇతరుల్లో ఆశను నింపండి. ఎప్పుడూ సౌకర్యవంతమైన మార్గాన్ని ఎంచుకునే వారికి విజయం దక్కదు. కఠినమైన మార్గాన్ని ఎంచుకునే ధైర్యం ఉన్నవారికే విజయం లభిస్తుంది. తక్కువ మంది ప్రయాణించే మార్గమే తరచుగా అద్భుతమైన విజయానికి దారితీస్తుంది. కొత్త విషయాలను అన్వేషించే ఆసక్తి పెంపొందించుకోండి. విఫలమైనా తట్టుకునే ధైర్యం, మళ్లీ పుంజుకునేంత దృఢ సంకల్పం కలిగి ఉండండి. గుర్తుంచుకోండి. పట్టభద్రుల వేడుకతో విద్య ముగిసిపోదు. అది జీవితకాల అభ్యాసానికి నాంది పలుకుతుంది.
యూనివర్సిటీ గర్వపడే స్థాయికి ఎదగండి
ఈ రోజు మీరు ఈ ప్రాంగణం నుండి వెళుతున్నప్పుడు మీ విజ్ఞానాన్ని,ఆత్మవిశ్వాసంతో, మీ విలువలను వినయంతో, మీ కలలను ధైర్యంతో ముందుకు తీసుకువెళ్ళండి. జీవితంలో ఎక్కువ మంది ప్రయాణించని మార్గాన్ని ఎంచుకోవడానికి ఎప్పుడూ భయపడకండి. ఎందుకంటే గొప్ప విజయాలు సమూహాలను అనుసరించడం వల్ల రావు. దానికి నాయకత్వం వహించే ధైర్యంతోనే వస్తాయి. మీ కుటుంబం గర్వపడేలా చేసే వృత్తిని ఎంచుకోండి. మీ విశ్వవిద్యాలయానికి గర్వకారణమయ్యే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోండి. భారతదేశం గర్వపడేలా ఒక గొప్ప వారసత్వాన్ని సృష్టించండి. ఎందుకంటే, పట్టభద్రులయ్యే మొదటి బ్యాచ్ కేవలం డిగ్రీలను మాత్రమే పొందదు. అది మీ తర్వాత వచ్చే ప్రతి తరానికీ స్ఫూర్తినిస్తుంది. మీ అందరికీ అభినందనలు. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టండి… కేవలం జీవనోపాధి కోసం మాత్రమే కాదు… అవకాశాలను సృష్టించడానికి… సమస్యలను పరిష్కరించడానికి… ఈ ప్రపంచాన్ని మీరు చూసిన దానికంటే మెరుగైనదిగా తీర్చిదిద్దడానికి కార్యోన్ముఖులు కావాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ శంకర్ ఆచార్య, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ఏ కోరి తదితరులు హాజరయ్యారు.
