అద్దె చెల్లించలేదని కోర్టు భవనానికి తాళం
భవన యజమాని ఆందోళన..
అద్దె బకాయిలు చెల్లించాలని డిమాండ్
ఓదెల, ఆంధ్రప్రభ: అద్దె బకాయిలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఓ భవన యజమాని ఏకంగా జ్యుడీషియల్ కోర్టు భవనానికే తాళం వేసిన ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది.
భవన యజమాని ముంజాల మధు తెలిపిన వివరాల ప్రకారం.. తన భవనాన్ని జ్యుడీషియల్ కోర్టు నిర్వహణ కోసం అద్దెకు ఇవ్వగా, 2025 ఏప్రిల్ 19న కోర్టు ప్రారంభమైంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క నెల అద్దె కూడా చెల్లించలేదని ఆయన ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు జిల్లా కోర్టు అధికారులను కలిసి అద్దె చెల్లించాలని కోరగా, బిల్లుల ప్రక్రియ పూర్తయిన తర్వాత చెల్లిస్తామని చెబుతూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అద్దె చెల్లించకపోవడంతో కోర్టు భవనాన్ని ఖాళీ చేయాలని కోరుతూ గతంలోనే జిల్లా కోర్టుకు, హైకోర్టుకు లేఖలు పంపినట్లు మధు తెలిపారు. ఇంతకుముందు కూడా రెండుసార్లు భవనానికి తాళం వేసినా, జిల్లా కోర్టు అధికారుల హామీ మేరకు తిరిగి తెరిచినట్లు చెప్పారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో బుధవారం మరోసారి కోర్టు భవనానికి తాళం వేశానని తెలిపారు. తనకు రావాల్సిన అద్దె బకాయిలు, విద్యుత్ బిల్లులు చెల్లించి భవనాన్ని ఖాళీ చేయాలని జిల్లా కోర్టు అధికారులను ఆయన కోరారు.
