ఉపాధి హామీపై కొత్త నిబంధనలు వద్దు

ఇటుకాలపల్లిలో రెండు గంటల రాస్తారోకో..

కేంద్రానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం హెచ్చరిక

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాల్సిన సమయంలో దాని అమలును బలహీనపరిచే కొత్త నిబంధనలను తీసుకురావడం సరికాదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగిస్తూ, కూలీల హక్కులకు భంగం కలిగించే మార్పులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు బుధవారం నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా భూక్య సమ్మయ్య మాట్లాడుతూ 2005లో అమల్లోకి వచ్చిన ఉపాధి హామీ చట్టం గ్రామీణ పేదలకు ఉపాధి, ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వలసలను అరికట్టడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. అయితే గత కొన్నేళ్లుగా నిధుల కోత, పనిదినాల తగ్గింపు, వేతనాల చెల్లింపులో జాప్యం, పనుల మంజూరులో ఆలస్యం వంటి కారణాలతో పథకం అమలు బలహీనపడుతోందని ఆరోపించారు.

ముఖ గుర్తింపు, బయోమెట్రిక్ వంటి కొత్త నిబంధనల వల్ల నిజంగా పనిచేసిన కూలీలు కూడా వేతనాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేసి ఏడాది పొడవునా పనులు కల్పించడం, సకాలంలో వేతనాలు చెల్లించడం, ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎస్‌కే అన్వర్, పెండ్యాల సారయ్య, గోనే మల్లారెడ్డి, నీరెడ్డి బాలకుమార్, బస్కే మొగిలి, వంగర రవినాయుడు, దేశిని నాగేష్, ఇండ్ల కుమ్మాలు రాములు, మచ్చుక సునీత, అనుముల సులోచన, పొన్నాల కవిత, చిమ్మని సురేష్ తదితరులు పాల్గొన్నారు.