కమ్మర్‌పల్లిలో గాయత్రీ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభం
పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన గాయత్రీ బ్యాంక్ శాఖను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి గాయత్రీ బ్యాంక్‌కు ఇది 83వ శాఖ కావడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సులభమైన, పారదర్శకమైన బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో బ్యాంక్ ముందుకు సాగడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుంటూ బ్యాంక్ మరింత అభివృద్ధి చెందాలని, పొదుపు సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు రైతులు, చిన్న వ్యాపారులు, మహిళా సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలకు మెరుగైన ఆర్థిక సేవలు అందించాలని ఆకాంక్షించారు.
నూతన శాఖ ఏర్పాటు చేసిన బ్యాంక్ యాజమాన్యానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మండల ప్రజలు బ్యాంక్ అందించే పొదుపు ఖాతాలు, రుణాలు, డిజిటల్ బ్యాంకింగ్ తదితర సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్యాంక్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
