విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి పాడి గేదె మృతి
తాడ్వాయి, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా తాడ్వాయి మండలం బేరెల్లి గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో ఓ రైతుకు చెందిన పాడి గేదె విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో బాధిత కుటుంబానికి సుమారు రూ. లక్ష మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
బాధితురాలు జాజ విజయచంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు ఐదేళ్ల వయస్సు గల చూడితో ఉన్న పాడి గేదె మేత కోసం వెళ్లిన సమయంలో గ్రామ సమీపంలోని విద్యుత్ స్తంభం వద్ద తెగిపోయిన వైరు సపోర్ట్ వైర్‌కు తగిలి విద్యుత్ ప్రవహిస్తోంది. అదే వైర్‌ను గేదె తాకడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటనకు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థులు ఆరోపించారు. ప్రమాదకర స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన వైర్లను సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న విద్యుత్ లైన్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ప్రమాదకర ప్రాంతాలను వెంటనే సరిచేయాలని కోరారు.
బాధిత కుటుంబానికి తక్షణమే పూర్తి నష్టపరిహారం అందించడంతో పాటు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, గ్రామంలోని ప్రమాదకర విద్యుత్ లైన్లను వెంటనే మరమ్మతు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
