చంద్రబాబుది ప్రజా సంక్షేమ ప్రభుత్వం
ప్రతి నెల 1న వేకువజామునే ఇంటింటికీ పెన్షన్లు
కొత్తచెరువులో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ
శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి, సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని కొత్తచెరువు మండలం మైలేపల్లి గ్రామంలో బుధవారం ఉదయం 7 గంటలకు నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొని లబ్ధిదారులకు ఇంటి వద్దకే సామాజిక భద్రతా పెన్షన్లు అందజేశారు. ప్రతి నెల 1వ తేదీన వేకువజామునే అర్హులైన పేదలకు ఇంటి వద్దకే పెన్షన్లు అందించడం కూటమి ప్రభుత్వ ప్రజాహిత పాలనకు నిదర్శనమని వారు తెలిపారు.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సుపరిపాలన కొనసాగుతోందన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కోసం రూ.68 వేల కోట్లకు పైగా ప్రభుత్వం వ్యయం చేసినట్లు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సుమారు రూ.23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు దక్కుతుందని కొనియాడారు. పుట్టపర్తి నియోజకవర్గంలో కూడా రూ.1.51 లక్షల కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే పెట్టుబడుల రాజధానిగా అవతరిస్తుందని, పేదల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ ఒలిపి శ్రీనివాసులు, కన్వీనర్ రామకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు సాలక్కగారి శ్రీనివాసులు, మైలేపల్లి గ్రామస్తులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
