chandrababu | డాక్టర్స్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రశంసలు
chandrababu | డాక్టర్స్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రశంసలు
chandrababu | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నిత్యం అంకితభావంతో సేవలందిస్తున్న వైద్యుల సేవలను కొనియాడుతూ, మానవత్వం పట్ల వారి నిబద్ధత దేశానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ నిర్మాణంలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.
సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలోని వైద్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి తన ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు. మానవత్వం పట్ల వైద్యులు చూపుతున్న అంకితభావం, వైద్య వృత్తిపై వారి నిబద్ధత నిజంగా ప్రశంసనీయమని అన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ వైద్యులు కరుణతో కూడిన సేవలను అందిస్తూ సమాజానికి అండగా నిలుస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వారు చేస్తున్న త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు.

అలాగే ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్య సాధనలో వైద్యులే ప్రధాన బలమని సీఎం అన్నారు. ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ నిర్మాణంలో వారి సేవలు వెలకట్టలేనివని, ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో వైద్యుల సహకారం అత్యంత కీలకమని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.
