hanamkonda | తండ్రిని కాపాడబోయి కొడుకు కూడా మృతి

hanamkonda | తండ్రిని కాపాడబోయి కొడుకు కూడా మృతి

hanamkonda | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పెళ్లై వారం రోజులు కూడా గడవకముందే హనుమకొండ జిల్లాలో చోటుచేసుకున్న విషాద ఘటన రెండు కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసింది. ఇంటికి ఏర్పాటు చేసిన అలంకరణ విద్యుత్ లైట్ల కారణంగా తండ్రి విద్యుద్ఘాతానికి గురికాగా, ఆయనను కాపాడేందుకు వెళ్లిన నవవరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయవిదారక ఘటన హనుమకొండ జిల్లా భీమారం ప్రాంతంలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం… భీమారానికి చెందిన సాంబయ్య–రమాదేవి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు శరత్ కుమార్, హైదరాబాద్‌లో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)గా పనిచేస్తున్నాడు. అతనికి జూన్ 24న వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా ఇంటిని విద్యుత్ అలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో ఇంటిపైకి వెళ్లిన సాంబయ్య అనుకోకుండా అలంకరణ విద్యుత్ వైర్లను తాకడంతో తీవ్ర విద్యుద్ఘాతానికి గురయ్యాడు. తండ్రి ప్రమాదంలో చిక్కుకున్నాడని గుర్తించిన శరత్ కుమార్ వెంటనే ఆయనను కాపాడేందుకు పరుగెత్తాడు. అయితే అతడూ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను హనుమకొండలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లి వేడుకల సందడి ముగియకముందే నవవరుడు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. నవవధువు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపిస్తుండగా, ఈ ఘటన భీమారం ప్రాంతంలో విషాదఛాయలు అలుముకునేలా చేసింది.