Engineers-Shortage : ఇంజనీర్లు కావలెను? Andhra Prabha Top Story
Engineers-Shortage : ఇంజనీర్లు కావలెను? Andhra Prabha Top Story
- ఉద్యొగ విరమణలో అనుభవజ్ఞులు
- సిబ్బంది లేమితో దుర్గగుడి అభివృద్ధి కుంటి నడక
- ఔట్ సోర్సింగ్ సిబ్బందే దిక్కు
- అవగాహన లేమితో ఇంజనీరింగ్ పనులు సతమతం
- ఇప్పటికే ఒక డీఈ రిటైర్
- ఈనెలాఖరున మరో ఈఈ పదవీ విరమణ
- సగానికి సగం కూడా పోస్టులు భర్తీ చేయని వైనం
- నత్తనడకన కోట్లాది రూపాయల పనులు
- ప్రసాదం పోటు భవన సెల్లార్ నిర్మాణంలో లోపాలపై కమిషనర్ ఆగ్రహం
- చిన్న వర్షానికే చెరువును తలపిస్తున్న వైనం
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో)
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో ఇంజనీర్ల కొరత వేధిస్తోంది. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో వివిధ అభివృద్ధి పనులు కూడా సమకూర్చాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ విభాగం కీలకంగా మారింది. అయితే అవినీతి ఊబిలో కొట్టుకుపోయిన దుర్గగుడి ఇంజనీరింగ్ విభాగంలో సిబ్బంది కొరత పెద్ద సమస్యగా మారింది. మరోవైపు అనుభవజ్ఞులు ఒకొక్కరే పదవీ విరమణ చేస్తుండడంతో పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. ఔట్ సోర్సింగ్ సిబ్బంది సగానికి పైగా ఉండడంతో ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా మారింది.
Engineers-Shortage మూడు దశాబ్దాల సేవలు…
దుర్గగుడిలో మూడు దశాబ్దాలపాటు సేవలందించిన ఇంజనీర్లు పదవీ విరమణ చేయనున్నారు. ఈనెలాఖరులో ఈఈ కోటేశ్వరరావు రిటైర్ కానుండడంతో పనులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఆలయంలోని వివిధ అభివృద్ధి నిర్మాణ పనుల్లో ఈఈ కోటేశ్వరరావు పాలుపంచుకోవడంతో ఆయన ఈ దేవస్థానంతో విశేష అనుబంధం ఉంది. ఆ స్థాయిలో అనుభవం ప్రస్తుత పనులకు ఉపయోగపడుతుందనుకున్న తరుణంలో ఆయన పదవీ విరమణతో పనుల పురోగతిని ప్రశ్నార్థకంగా మార్చింది. ఆయనతో పాటు మరికొంత మంది సీనియర్లు సైతం ఇటీవల పదవీ విరమణ చేయడంతో ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ల కొరత వేధిస్తోంది. ఎక్కువ మంది ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కొత్తగా వచ్చిన యువత ఉండడంతో వారికి ఆలయ నిర్మాణ పనులపై ఎటువంటి అవగాహన ఉండడం లేదు. దానికితోడు ప్రస్తుతం ఉన్న యువ ఇంజనీర్లకు ఓపిక, సహనం లేకపోవడంతో చూద్దాం..చేద్దాం అనే ధోరణితో ఉంటుండడంతో పనులు అటకెక్కుతున్నాయి. ఎప్పుడో పూర్తికావాల్సిన ఎలివేటెడ్ క్యూ క్యాంప్లెక్స్ ఏళ్ల తరబడి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. గత దసరా ఉత్సవాల్లోనూ ప్రారంభిస్తామంటూ ఆర్భాటాలు పోయిన అధికారుల మళ్లీ దసరా వస్తున్నా ప్రసాదం పోటు నిర్మాణ పనులను పూర్తిచేయించలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయి. అనుభవజ్ఞులు లేమితో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్న విమర్శలు వస్తున్నాయి.
Engineers-Shortage అటకపై మాస్టర్ ప్లాన్
రెండేళ్ల కాలంలో మాస్టర్ ప్లాన్ ఏమేరకు జరిగాయన్న ప్రశ్నకు ఏమో అనే సమాధానమే అధికారుల నుంచి వస్తోంది. ఎప్పుడు అడిగినా కాగితాల్లోనూ కోట్ల రూపాయల ప్రాజెక్టులు అంటూ చూపించడం మినహా వాస్తవ రూపంలో మాత్రం శూన్యమనే చెప్పవచ్చు. అసలు ఇంజనీరింగ్ విభాగం అంటూ ఒకటుందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ మధ్యలో ఎందుకు నిలిపివేశారంటే దానికి సమాధానం కరవవుతోంది. ఇలా ప్రతి పని కూడా ప్రారంభించడం మధ్యలో నిలిపివేయడం దేవస్థానంలో రివాజుగా మారింది. కోట్లాది రూపాయల దుర్గ మ్మ నిధులను నిరుపయోగంగా మారుస్తూ భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా చోద్యం చూస్తున్నారు.
Engineers-Shortage ఎంత మంది అవసరం…
అసలు దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉండాలి. ఇందులో ఒకరు ఈనెలాఖరున పదవీ విరమణ చేస్తున్నారు. డీఈలు ఎనిమిది మంది ఉండాల్సి ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారంటే పనుల్లో వేగం ఎలా ఉంటుందన్న ప్రశ్న ఉద్భవిస్తోంది. ఆ ఇద్దరూ కూడా సివిల్ వర్క్స్‌కు సంబంధించివాళ్లే అయినప్పుడు అభివృద్ధి పనుల్లో వారు ఏవిధంగా పూర్తిచేస్తారో ఆలయ కార్యనిర్వహణాధికారికి తెలియదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఏఈలు 16 మంది ఉండాల్సి ఉండగా అందులో సగం అంటే 8 మందితోనే నెట్టుకువస్తున్నారు. ఒకవైపు కోట్లాది రూపాయల పనులంటూ చూపెడుతున్నారే తప్ప ఇంజనీర్లు లేకపోవడంలో పనులు ఎలా పూర్తవుతాయన్న విషయం ఉన్నతాధికారులకు తెలియకపోవడంతో ఆశ్చర్యంగా ఉందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏఈల్లో కూడా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వారే కావడంతో వారికి పని పట్ల నిబద్ధత ఉండకపోవడంతో జాప్యానికి అదీ ఒక కారణంగా ఉంటోంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఏఈలు నలుగురు ఉండాల్సి ఉండగా కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇక అతి ముఖ్యమైన మెకానికల్ ఏఈలకు సంబంధించి ఇద్దరు ఉండాల్సి ఉండగా కేవలం ఒక్కరే ఉండడంతో సిబ్బంది నియమాకంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అతి ముఖ్యమైన ట్రాన్స్ పోర్టు, వాటర్ వర్క్స్ తో పాటు ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ కీలక బాధ్యతలను నిర్వహిస్తుంది. ఆలయంలో ఏవైనా ఉత్సవాలు జరిగే సమయంలో ఏదైనా పొరపాట్లు జరిగితే ఇంజనీరింగ్ సెక్షనే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. సిబ్బంది కొరతతో సతమతమయ్యే ఈ విభాగమే తప్ప్పులను కూడా మోయాల్సి వస్తోంది. అతి ముఖ్యమైన ట్రాన్స్ పోర్టు విభాగానికి డీఈ లేకపోవడం దారుణమని పలువురు మండిపడుతున్నారు.
Engineers-Shortage నిరంతర పర్యవేక్షణ తప్పని సరి
ఇంజనీరింగ్ పనుల్లో నాణ్యతను పరిశీలించేందుకు నిరంతరం తనిఖీలు చేయాల్సి ఉంది. అయితే సిబ్బంది కొరత కారణంగా తూతూమంత్రంగానే తనిఖీలు చేయడంతో నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన ప్రసాదం పోటు భవనం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. మట్టి పరీక్షలు చేయకుండా హడావుడిగా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడంతో పాటు వాటాలు తీసుకొని పనులు చేపట్టిన అధికారులు ప్రస్తుతం తలలు పట్టుకోవాల్సి వచ్చింది. పోటు భవన సెల్లార్లో నీరు నిల్వ ఉండడంపై ఇటీవల కమిషనర్ తనిఖీలు చేపట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా మట్టి పరీక్షలు చేయాల్సి ఉన్నా తూతూ మంత్రంగా చేపట్టి కోట్లాది రూపాయల అమ్మవారి ఆదాయానికి గండి కొట్టారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేస్తూ నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతో ఇవి మూణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఇలా అతి ముఖ్యమైన ఇంజనీరింగ్ సెక్షన్ లో అనుభవజ్ఞుల లేమి, సిబ్బంది కొరత, అవగాహన లోపం, సమన్వయం లేకపోవడం, అవినీతి పెరిగిపోవడంతో అభివృద్ధి పనులు కూడా నెమదిస్తున్నాయి.
