లక్ష్మీపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నిధులు విడుదల చేయాలి

కడెం, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నవాబ్‌పేట్ గ్రామపంచాయతీ పరిధిలో ప్రతిపాదిత లక్ష్మీపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి వెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో నీటిపారుదల శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్‌ను కలిసి పథకానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, లక్ష్మీపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అమల్లోకి వస్తే కడెం మండలంలోని నవాబ్‌పేట్, లక్ష్మీపూర్, కల్లెడ, దోస్తునగర్‌తో పాటు దస్తూరాబాద్ మండలంలోని ఆకొండపేట గ్రామ రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడి వ్యవసాయానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పథకానికి అవసరమైన నిధులను త్వరితగతిన విడుదల చేసి పనులు ప్రారంభించాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి. భూషణ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ముడికె మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు బరపటి రమేష్ వర్మ, నవాబ్‌పేట్ మాజీ సర్పంచ్ రాపల్లి రాజలింగు, కల్లెడ ఉప సర్పంచ్ ఆత్రం రాజేశ్వర్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags: Khanapur, Lift Irrigation