Apl-2026 : భీమవరం బుల్స్ సూపర్ విక్టరీ Andhra Prabha Sports Story
Apl-2026 : భీమవరం బుల్స్ సూపర్ విక్టరీ Andhra Prabha Sports Story
- ఏపీఎల్-5 ట్రోఫీ కైవసం..
- ఫైనల్లో సింహాద్రి వైజాగ్ లయన్స్ పై విజయం
- కేవలం 9 ఓవర్లలోనే 140 పరుగుల లక్ష్యం చెదన..
- రికార్డు సృష్టించిన హేమంత్, రేవంత్ రెడ్డి జోడీ
- విజేతలకు రూ.35 లక్షలు…
- రన్నరప్‌కు రూ.20 లక్షలు..
- నగదు బహుమతి అందజేసిన మంత్రి నారా లోకేష్..
- మంగళగిరిలోముగిసిన క్రికెట్ సంబరం
( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో )

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-5 టైటిల్‌ను భీమవరం బుల్స్ ఘనంగా కైవసం చేసుకుంది. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్లో సింహాద్రి వైజాగ్ లయన్స్‌పై ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించి చాంపియన్‌గా అవతరించింది. కేవలం తొమ్మిది ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఏపీఎల్ ఫైనల్ చరిత్రలోనే అత్యంత ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.
Apl-2026 : ఒత్తిడిలో వైజాగ్ సింహాద్రి…
ఏపీఎల్ ఫైనల్ పోరులో టాస్ గెలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. టాప్ ఆర్డర్ విఫలమైన వేళ త్రిపురణ విజయ్ 25 బంతుల్లో అజేయంగా 39 పరుగులు, బోధల వినయ్ కుమార్ 14 బంతుల్లో 19 పరుగులతో పోరాడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. భీమవరం బౌలర్ రవితేజ మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కట్టడి చేశాడు.
Apl-2026 :చెలరేగిన భీమవరం బుల్స్….

140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భీమవరం బుల్స్ బ్యాటర్లు హేమంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఏ దశలోనూ ప్రత్యర్థి బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. కెప్టెన్ ఎం. హేమంత్ రెడ్డి 23 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 59 పరుగులు చేయగా, రేవంత్ రెడ్డి 33 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 71 పరుగులు సాధించాడు. వికెట్ కూడా కోల్పోకుండా కేవలం 9 ఓవర్లలోనే 140 పరుగులు చేసి భీమవరం బుల్స్‌కు చిరస్మరణీయమైన టైటిల్‌ను అందించారు. ఫైనల్లో అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో మూడు వికెట్లు సాధించిన రవితేజకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
Apl-2026 : ముఖ్యఅతిథిగా మంత్రి లోకేష్…

ఫైనల్ మ్యాచ్‌కు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి, ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభించారు. అనంతరం విజేత భీమవరం బుల్స్ జట్టుకు రూ.35 లక్షల ప్రైజ్ మనీ చెక్కుతో పాటు ట్రోఫీని అందజేయగా, రన్నరప్ సింహాద్రి వైజాగ్ లయన్స్‌కు రూ.20 లక్షల నగదు బహుమతి చెక్కును అందించారు. మ్యాచ్‌కు ముందు మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో చేపట్టిన ఆధునీకరణ, అభివృద్ధి పనుల స్మారక ఫలకాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు.

ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక వసతుల కల్పనలో ఈ స్టేడియం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీష్ బాబు, ఉపాధ్యక్షుడు బండారు నరసింహారావు, సంయుక్త కార్యదర్శి బోయల్ల విజయ్ కుమార్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, ఎంపీ భరత్, కౌన్సిలర్ విష్ణు దంతు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు వేలాది మంది క్రికెట్ అభిమానులు స్టేడియానికి తరలిరావడంతో ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. స్టేడియం పూర్తిగా నిండిపోవడంతో పలువురు అభిమానులను గేటు వెలుపలే నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది.
