సింగపూర్‌కు సీమ మామిడి.. ఎగుమతుల్లో ఏపీకి కొత్త విజయగాథ
సింగపూర్‌కు సీమ మామిడి.. ఎగుమతుల్లో ఏపీకి కొత్త విజయగాథ
తొలి విడతలో 5 మెట్రిక్ టన్నుల మామిడి విజయవంతంగా ఎగుమతి
విమాన రవాణాకు ప్రత్యామ్నాయంగా సముద్ర మార్గం
కిలోకు రూ.100 వరకు తగ్గిన ఎగుమతి వ్యయం
బంగినపల్లె మామిడికి కొత్త అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు
తిరుపతి (రాయలసీమ), ఆంధ్రప్రభ బ్యూరో: ఎగుమతుల రవాణాలో సవాళ్లను అధిగమించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసింది. విమానయాన రవాణా మార్గానికి ప్రత్యామ్నాయంగా సముద్ర మార్గంలో సింగపూర్‌కు మామిడి ఎగుమతి ప్రయత్నం విజయవంతమైంది. ఈ మేరకు భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్), వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల సంస్థ (ఏపెడ) సంయుక్తంగా చేపట్టిన వ్యూహం ఫలించింది.
జూన్ రెండో వారంలో పంపిన 5 మెట్రిక్ టన్నుల మామిడి పళ్లు జూన్ 24వ తేదీన సింగపూర్ చేరుకున్నాయి. విమాన రవాణాకు ప్రత్యామ్నాయంగా చేపట్టిన ఈ సముద్ర రవాణా కారణంగా ప్రతి కిలోకు రూ.100 పైగా ఆదా అయినట్టు అధికారులు ప్రకటించారు.
రాష్ట్రంలో మామిడి దిగుబడిలో 70 శాతం వాటా రాయలసీమ ప్రాంతానిదే. ఏటా 5 వేల నుంచి 6 వేల మెట్రిక్ టన్నుల మామిడి పళ్లు అమెరికా, బ్రిటన్, సింగపూర్, మలేషియా, హాంగ్‌కాంగ్, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అందులో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాలో ఎక్కువగా పండే బంగినపల్లె మామిడిపళ్లు సింహభాగంలో ఉంటాయి. బంగినపల్లె మామిడికి 2017లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు కూడా లభించింది.
అయితే ఈ ఏడాది ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో అలుముకున్న యుద్ధ వాతావరణం కారణంగా తగ్గిపోయిన విమాన సర్వీసులు మామిడి ఎగుమతిపై ప్రభావం చూపాయి.
కొత్త సముద్ర రవాణా ప్రోటోకాల్
ఈ పరిస్థితుల్లో ఐసీఏఆర్‌కు చెందిన సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ (లక్నో), కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ అనుబంధ విభాగమైన ఏపెడ నిపుణులు విమాన రవాణాకు ప్రత్యామ్నాయంగా శాస్త్రీయ సముద్ర రవాణా ప్రోటోకాల్ రూపొందించారు.
ఆ ప్రోటోకాల్ ప్రకారం ఫ్యూసికాంట్ జీవ నియంత్రణ సాంకేతికతతో 30 రోజుల పాటు నిల్వ ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో శుద్ధి చేసిన బంగినపల్లె మామిడి పళ్లను ఎంపిక చేశారు. వాటిని సముద్ర మార్గంలో సింగపూర్‌కు రవాణా చేశారు. ప్రత్యేక కంటైనర్‌లో కర్ణాటక నుంచి ఓడ ద్వారా పంపించారు.
సురక్షితంగా రవాణా…
ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండా సింగపూర్‌కు మామిడి పళ్లు చేరుకున్నాయని ఏపెడ తెలిపింది. విమాన రవాణాకు కేజీకి రూ.150 నుంచి రూ.200 ఖర్చు అవుతుంటే, సముద్ర రవాణాలో ఈ వ్యయం కేజీకి రూ.13 నుంచి రూ.20 మాత్రమే అయిందని సంబంధిత అధికారులు తెలిపారు.
సింగపూర్ చేరుకున్న పళ్లు సింగపూర్, హాంగ్‌కాంగ్ తదితర దేశాల మార్కెట్లకు తరలిస్తున్నట్టు వెల్లడించారు. ఈ విజయవంతమైన ప్రయోగం భవిష్యత్తులో భారత మామిడి ఎగుమతులకు కొత్త అవకాశాలు తెరవనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
