India-Japan Relations | భారత్-జపాన్ దౌత్యంలో నూతన దృక్పథం..

India-Japan Relations | భారత్-జపాన్ దౌత్యంలో నూతన దృక్పథం..

చారిత్రక అనుబంధం నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యం వరకు

16వ శిఖరాగ్ర సమావేశంపై ప్రపంచ దృష్టి

రక్షణ, సాంకేతికతలో వేగంగా విస్తరిస్తున్న సహకారం

ఇండో-పసిఫిక్‌లో భారత్-జపాన్ కీలక పాత్ర

ఆర్థిక భద్రత, సెమీకండక్టర్లలో కొత్త అవకాశాలు

India-Japan Relations| ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్న ఈ కాలంలో కొన్ని ద్వైపాక్షిక సంబంధాలు కేవలం రెండు దేశాల మధ్య సహకారానికే పరిమితం కావు. అవి ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, ఆర్థిక వ్యవస్థ, భద్రతా సమీకరణలను ప్రభావితం చేసే వ్యూహాత్మక భాగస్వామ్యాలుగా రూపాంతరం చెందుతాయి. భారత్-జపాన్ సంబంధాలు నేడు అలాంటి అరుదైన భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలిచాయి.

శతాబ్దాల క్రితం బౌద్ధమతం ద్వారా ప్రారంభమైన సాంస్కృతిక అనుబంధం, స్వాతంత్ర్యానంతరం దౌత్య సంబంధాలుగా రూపుదిద్దుకుని, “ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి చేరుకుంది. ప్రజాస్వామ్య విలువలు, పరస్పర విశ్వాసం, నియమాల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థపై నిబద్ధత, శాంతి, స్థిరత్వాల పట్ల ఉమ్మడి దృక్పథం ఈ బంధానికి బలమైన పునాదిగా నిలిచాయి.

ఈ నేపథ్యంలో జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి జూలై 1 నుంచి 3 వరకు భారతదేశంలో చేపట్టనున్న తొలి అధికారిక విదేశీ పర్యటనకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే తొలి విదేశీ పర్యటన కావడం విశేషం. ఈ సందర్భంగా జరిగే 16వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కేవలం దౌత్య సమావేశాల కార్యక్రమం మాత్రమే కాదు. ఆసియా వ్యూహాత్మక భవిష్యత్తును నిర్దేశించే కీలక వేదికగా దీనిని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరగనున్న చర్చలు రక్షణ, ఆర్థికాభివృద్ధి, సాంకేతికత, ప్రాంతీయ భద్రత వంటి అనేక రంగాల్లో కొత్త నిర్ణయాలకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది.

గత రెండు దశాబ్దాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా విస్తరించాయి. ఒకప్పుడు అభివృద్ధి సహాయం, వాణిజ్యం, పెట్టుబడులకు మాత్రమే పరిమితమైన సహకారం ఇప్పుడు రక్షణ, అంతరిక్షం, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, డిజిటల్ టెక్నాలజీ, స్వచ్ఛ ఇంధనం, భద్రత, కీలక ఖనిజాలు, సముద్ర భద్రత వంటి భవిష్యత్ రంగాలకు విస్తరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వర్తక వాణిజ్యం, రవాణా సరఫరా వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న ఈ సమయంలో విశ్వసనీయ భాగస్వామిగా భారతాన్ని జపాన్ మరింత ప్రాధాన్యంతో చూస్తోంది.

ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ఆర్థిక భద్రతా వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారుతున్న తరుణంలో భారత్-జపాన్ సహకారం ప్రత్యేక స్థానం సంపాదించింది. భారతదేశం అమలు చేస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్, జపాన్ ప్రతిపాదించిన ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్ దృక్పథాలు పరస్పరం ఒకదానికొకటి బలాన్ని చేకూరుస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియాలతో కలిసి క్వాడ్ వేదికపై ఇరు దేశాలు ప్రాంతీయ శాంతి, స్వేచ్ఛాయుత సముద్ర రవాణా, నియమాల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ పరిరక్షణకు కట్టుబడి పని చేస్తున్నాయి.

రక్షణ రంగంలో కూడా ఈ భాగస్వామ్యం కొత్త దశలోకి అడుగుపెట్టింది. సంయుక్త సైనిక విన్యాసాలు, సముద్ర భద్రత, కోస్ట్ గార్డ్ సహకారం, రక్షణ సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి వంటి అంశాల్లో ఇప్పటికే గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. ఇది ఏ దేశానికి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి కాదని ఇరు దేశాలు స్పష్టం చేస్తున్నప్పటికీ, ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడే బాధ్యతాయుత ప్రజాస్వామ్య శక్తులుగా తమ పాత్రను మరింత బలోపేతం చేస్తున్నాయి.

ఆర్థిక రంగంలోనూ ఇరు దేశాలు కొత్త దిశగా అడుగులు వేస్తున్నాయి. సెమీకండక్టర్ల కొరత, కీలక ఖనిజాల కోసం పెరుగుతున్న పోటీ నేపథ్యంలో ఆర్థిక భద్రత ఇప్పుడు జాతీయ భద్రతలో భాగమైంది. టెలికమ్యూనికేషన్లు, ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్ష సాంకేతికత, ఉపగ్రహ నిర్మాణం, ఎరోస్పేస్, డ్రోన్ సాంకేతికత, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఆధునిక తయారీ రంగాల్లో సంయుక్త పెట్టుబడులు, పరిశోధన, సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరు దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈ సహకారం ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారతాన్ని మరింత కీలక కేంద్రంగా నిలబెట్టే అవకాశముంది.

మౌలిక సదుపాయాల అభివృద్ధిలో జపాన్ భారతదేశానికి అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా నిలిచింది. 1958లో ప్రారంభమైన యెన్ రుణాల ప్రయాణం నేడు ఢిల్లీ మెట్రో, ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు, పారిశ్రామిక కారిడార్లు, ఈశాన్య భారత కనెక్టివిటీ, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వరకు విస్తరించింది. అలాగే మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల విస్తరణలోనూ ఇరు దేశాలు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. భారత యువతకు జపాన్లో పెరుగుతున్న అవకాశాలు రెండు దేశాల మధ్య సామాజిక, ఆర్థిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.

ప్రస్తుతం భారతదేశంలో వెయ్యికి పైగా జపాన్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, తయారీ, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనం, ఎలక్ట్రానిక్స్, డిజిటల్ టెక్నాలజీ, స్వచ్ఛ ఇంధనం వంటి రంగాల్లో మరిన్ని పెట్టుబడులకు మార్గం సిద్ధమవుతోంది.

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ భద్రతా పరిస్థితుల్లో ఏర్పడుతున్న అనిశ్చితి భారత్-జపాన్ భాగస్వామ్యానికి మరో కోణాన్ని జోడించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలకు జపాన్ ఎప్పటి నుంచో మద్దతు ఇస్తూ, భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని నిరంతరం వాదిస్తోంది. జీ-4 దేశాల వేదిక ద్వారా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్న జపాన్, ప్రపంచ శాంతి, ఉగ్రవాద నిరోధం, సముద్ర భద్రత, మానవతా సహాయం వంటి అంశాల్లో భారత్ పోషిస్తున్న పాత్రను బలంగా సమర్థిస్తోంది.

మధ్యప్రాచ్య సంక్షోభం వంటి సున్నితమైన పరిస్థితుల్లో కూడా శాంతియుత పరిష్కారం, అంతర్జాతీయ చట్టాల గౌరవం, పౌరుల రక్షణ, సముద్ర మార్గాల భద్రత వంటి అంశాలపై ఇరు దేశాలు ఒకే దృక్పథాన్ని పంచుకుంటున్నాయి. ప్రపంచ రాజకీయ సమీకరణాలు మారుతున్న ఈ సమయంలో ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ వేదికలపై జపాన్ అందిస్తున్న దౌత్యపరమైన మద్దతు భారత్కు మరింత బలాన్ని అందిస్తోంది. 16వ భారత్-జపాన్ శిఖరాగ్ర సమావేశం నుంచి వెలువడే నిర్ణయాలు ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా, ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రత, ప్రపంచ సరఫరా వ్యవస్థ, సాంకేతిక సహకారం, ఆర్థికాభివృద్ధి, బహుళపాక్షిక దౌత్యానికి కొత్త దిశను నిర్దేశించే అవకాశముంది. మారుతున్న ప్రపంచ వ్యూహాత్మక పరిస్థితుల్లో భారత్-జపాన్ భాగస్వామ్యం ఆసియా భవిష్యత్తును మాత్రమే కాదు, ప్రపంచ స్థిరత్వాన్ని ప్రభావితం చేసే అత్యంత కీలక ప్రజాస్వామ్య భాగస్వామ్యంగా ఎదుగుతున్నదనడంలో సందేహం లేదు.