ఏపీ బీజేపీలో నూతన జిల్లా ఇన్‌ఛార్జిలు..

  • రాష్ట్రంలోని 28 జిల్లాలకు కొత్త బాధ్యులు
  • తక్షణమే అమల్లోకి నియామకాలు
  • ఎన్టీఆర్ జిల్లాకు వెంకట సుబ్బారావు నార్ని (తాతాజీ)

విజయవాడ, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ రాష్ట్రంలోని 28 జిల్లాలకు కొత్త జిల్లా ఇన్‌ఛార్జిలను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన ప్రకటించారు.

కొత్త నియామకాలలో తూర్పు గోదావరి జిల్లాకు బుద్ధా లక్ష్మీనారాయణ, కృష్ణా జిల్లాకు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లాకు వెంకట సుబ్బారావు నార్ని (తాతాజీ), గుంటూరుకు వి.వి.ఆర్. మోహన్ (దొరబాబు) నియమితులయ్యారు.

పల్నాడు జిల్లాకు తొగంటి శ్రీనివాస్‌తో పాటు అవుల నాగేంద్ర కుమార్ యాదవ్‌ను జిల్లా కో-ఇన్‌ఛార్జిగా, నంద్యాల జిల్లాకు పి.డి. పార్థసారథితో పాటు అంబిలి కాశీ విశ్వనాథ్‌ను జిల్లా కో-ఇన్‌ఛార్జిగా నియమించారు.

పార్టీ సంస్థాగత బలోపేతం, జిల్లా స్థాయిలో కార్యక్రమాల సమన్వయం, సభ్యత్వ విస్తరణ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.