జగన్మాతను దర్శించుకున్న ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి
- విజయ్ శర్మకు ఇంద్రకీలాద్రిపై ఘన స్వాగతం
- కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మ కు ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారును కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ పర్యటనలో భాగంగా మంగళవారం ఆలయానికి చేరుకున్న ఉపముఖ్యమంత్రికి దేవస్థాన అధికారులు, అర్చక బృందం సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకున్న విజయ్ శర్మ ప్రత్యేక పూజల్లో పాల్గొని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఉప ప్రధాన అర్చకులు శంకర్ శాండిల్య వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందించారు. దేవస్థానం తరఫున ఆలయ ఉప ప్రధాన అర్చకులు శంకర్ శాండిల్యతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవురు శ్రీనివాసరావు ఉపముఖ్యమంత్రికి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.
