ఏపీఎల్ ఫైనల్‌కు శ్రీకారం చుట్టిన నారా లోకేష్
- మంగళగిరిలో క్రికెట్ సంబరం
- టాస్ వేసి సింహాద్రి వైజాగ్ లయన్స్–భీమవరం బుల్స్
- తుది పోరును ప్రారంభించిన మంత్రి లోకేష్
- ఆధునీకరించిన ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం స్మారక ఫలకాన్ని ఆవిష్కరణ
ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ: మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మంగళవారం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఫైనల్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ అభిమానుల కేరింతలతో మారుమోగింది. వేలాది మంది ప్రేక్షకుల ఉత్సాహభరిత హర్షధ్వానాల మధ్య జరిగిన తుది పోరుకు రాష్ట్ర ఐటీ, మానవ వనరులు, ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి మ్యాచ్‌ను అధికారికంగా ప్రారంభించారు.
టాస్ గెలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా, భీమవరం బుల్స్ జట్టుతో టైటిల్ కోసం తలపడింది. ఈ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లకు మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీడాస్ఫూర్తితో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అభిమానులకు చిరస్మరణీయమైన మ్యాచ్ అందించాలని ఆకాంక్షించారు. మ్యాచ్‌కు ముందు మంగళగిరి ఏసీఏ క్రీడా ప్రాంగణంలో ఆధునీకరణ పనులు పూర్తి చేసిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం స్మారక ఫలకాన్ని మంత్రి నారా లోకేష్ ఘనంగా ఆవిష్కరించారు.
రాష్ట్రంలో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక వసతుల కల్పనలో ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీష్ బాబు, ఉపాధ్యక్షుడు బండారు నరసింహారావు, సంయుక్త కార్యదర్శి బోయల్ల విజయ్ కుమార్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ విష్ణు దంతు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడా ప్రముఖులు, క్రీడాకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


