సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

  • లోటుపాట్లకు తావులేకుండా చర్యలు
  • ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి
  • భద్రత, ప్రోటోకాల్, వసతి ఏర్పాట్లపై ఆదేశాలు
  • కలెక్టరేట్‌లో అధికారులతో కలెక్టర్, ఎస్పీ సమీక్ష

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1 నుంచి 3వ తేదీ వరకు తిరుపతి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ శారదాదేవి, డీఆర్వో నరసింహులు, అడిషనల్ ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

సమన్వయంతో పనిచేయాలి

ఈ సందర్భంగా.. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో పలువురు వీవీఐపీలు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోపాలకు తావులేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి జిల్లాలో రెండు రోజుల పాటు బస చేయనున్నందున భద్రత, ప్రోటోకాల్, వసతి, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, తాగునీరు, అగ్నిమాపక, ఆహార భద్రత తదితర అంశాల్లో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సత్యవేడు హీరో మోటోకార్ప్, రైల్వే కోడూరు, తాజ్ హోటల్, కలెక్టరేట్ తదితర ప్రధాన కార్యక్రమ ప్రాంతాల్లో విధులు కేటాయించిన సిబ్బంది ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

సమాన ప్రాధాన్యత

ముఖ్యమంత్రి పర్యటనతో పాటు జిల్లాకు విచ్చేస్తున్న ఇతర వీవీఐపీల కార్యక్రమాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. వీవీఐపీ పర్యటనల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని, అవసరానికి మించి వాహనాలను నిలిపివేయకుండా రాకపోకలు నిరంతరాయంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. అలాగే వీవీఐపీల పర్యటనల సందర్భంగా పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను యథావిధిగా అమలు చేయాలని, ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు.

సమగ్ర భద్రతా ఏర్పాట్లు

ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్టు నుంచి కార్యక్రమ వేదికలు, బస చేసే ప్రాంతాల వరకు సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణ, యాక్సెస్ కంట్రోల్, కాన్వాయ్ నిర్వహణ, నైట్ హాల్ట్ భద్రత, బాంబ్ డిటెక్షన్ తనిఖీలు, ఫైర్ సేఫ్టీ, విద్యుత్ స్టాండ్‌బై, వాహనాల సమీకరణ తదితర అంశాల్లో నిర్ణీత ప్రోటోకాల్ మేరకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ప్రోటోకాల్, ఆర్ అండ్ బీ, విద్యుత్, వైద్య, అగ్నిమాపక, రవాణా, ఆహార భద్రత శాఖల అధికారులు పాల్గొన్నారు.